బుట్టాయగూడెం. యద్దనపూడి సూర్యనారాయణ మూర్తి స్మారక ఉత్తమజర్నలిస్ట్ పురస్కారానికి బుట్టాయిగూడెం విలేఖరి మామిడిశెట్టి శ్రీ రాంప్రసాద్ ఎంపికయినట్లు ఈఅవార్డు ఎంపిక కమిటీ కన్వీనర్ దూసనపూడి సోమసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాడేపల్లిగూడెంలో సోమవారం జరిగిన అవార్డు ఎంపిక కమిటీ సమావేశంలో తమకు వచ్చిన ఎంట్రీలను పరిశీలించి 2023 వ సంవత్సరంలో ఏడాది పొడవునా విలేఖరి రాసిన వార్తా కథనాలు, అందుకోసం చేసిన కృషి, వార్తలకు వచ్చిన స్పందనలను దృష్టిలో ఉంచుకుని ఎం.శ్రీరాంప్రసాద్ ను పురస్కారానికి ఏకగ్రీవంగా కమిటీ ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ
సమావేశంలో ఎంపిక కమిటీ సభ్యులు ఏ.పి.యు.డబ్ల్యు.జే. జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిసెట్టి రంగసురేష్, సీనియర్ పాత్రికేయులు తేతలి గంగాధర రెడ్డి, యద్దనపూడి సుబ్బారావు పాల్గొన్నారని తెలిపారు.
ప్రముఖ పాత్రికేయుడు, సుప్రసిద్ధ సంఘసేవకుడు యద్దనపూడి సూర్య నారాయణమూర్తి పేరిట గత 12 సంవత్సరాలుగా ప్రతిఏటా జిల్లాస్థాయిలో ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం ప్రదానం చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 31 వ తేదీ ఉదయం 10 గంటలకు తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహింస్తున్న యద్దనపూడి 13 వ వర్ధంతి సందర్భంగా అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.జిల్లాలోని సీనియర్ పాత్రికేయులకు యద్దనపూడి పేరిట చేస్తున్న సత్కారంలో భాగంగా ఈ ఏడాది సీనియర్ పాత్రికేయులు పి.వి.ఎ. ప్రసాద్ (రత్నగర్భ, ఏలూరు)వి. నాగేశ్వర లింగమూర్తి ( ఆంధ్ర జ్యోతి, భీమవరం,) ఐతా సురేష్ ( విశాలాంధ్ర , కుక్కునూరు) , ను సత్కరించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
యద్దనపూడి కుటుంబ సభ్యుల సహకారంతో జనవరి 31 వ తేదీ ఉదయం జరుగుతున్న అవార్డు ప్రదానం, సత్కారం , కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ కోరింది. ఈ అవార్డుకు శ్రీరాంప్రసాద్ ఎంపిక కావడం పట్ల మండలంలోని సహచర పాత్రికేయులు, అధికారులు, ప్రజా సంఘాలు, తదితరులు అభినందనలు తెలిపారు.

