- ఎమ్మెల్యే అభ్యర్థి మాక్బూల్
కదిరి:ముస్లిం మైనార్టీల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని కదిరి అసెంబ్లీ అభ్యర్థి బి.యస్ మక్బూల్ అహ్మద్ పేర్కొన్నారు. బుధవారం కదిరి నియోజవర్గానికి సంబంధించిన ప్రభుత్వ ఖాజీలు మక్బూల్ ను ఆయన స్వగృహంలో కలిసి పూలమాల వేసి, దుశాలువ కప్పి సన్మానించారు. సత్యసాయి జిల్లా ప్రభుత్వ ఖాజీల అధ్యక్షులు షేక్ రఫీక్ ఆధ్వర్యంలో ఆయన్ను కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ ఉద్యోగ పరిమితిని మూడు నుండి పది సంవత్సరాలకు పెంచుతూ జీవో విడుదల చేశారని, అందుకు జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని ఖాజీలు పేర్కొన్నారు. అయితే కాలపరిమితి సర్టిఫికెట్లు ఖాజీలకు అందలేదని, వెంటనే అందజేయాలని వారు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మక్బూల్ స్పందిస్తూ అతి త్వరలోనే ఖాజీలకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఐడి కార్డుల విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాబోవు రోజుల్లో ఎటువంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించడంలో తాను ముందుంటానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోలోనే మైనార్టీలకు న్యాయం జరిగిందని, జగన్ కు మైనార్టీలంటే ఎంతో అభిమానం ఉందన్నారు. ఇందుకు నిదర్శనం రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఏడుగురు ముస్లిం మైనారిటీలకు అవకాశం కల్పించడమేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, ఖాజీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.