కదిరి :ముస్లిం మైనార్టీలంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు చులకన భావం ఉందని, అందుకు నిదర్శనం తానేనని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా పేర్కొన్నారు. ఆదివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి గతంలో టీడీపీలో చేరిన తనకు ఆ పార్టీలో అన్ని విధాలుగా అవమానాలు తప్ప తగిన గుర్తింపు లభించలేదని, అందుకే తాను రాజీనామా చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు అవమానాలు తప్ప అధికారమివ్వని టీడీపీలో కొనసాగలేనని చెప్పారు. మంత్రి పదవితో పాటు తగిన గుర్తింపును ఇస్తామని చంద్రబాబు మాట తప్పారన్నారు. ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకుండా అన్ని విధాల అవమానపరిచారని ఆరోపించారు. కదిరి పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజరయ్యారని, తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. అలాగే బహిరంగ సభకు కూడా కనీస సమాచారం ఇవ్వలేదని వాపోయారు. ముస్లిం మైనారిటీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని టీడీపీలో కొనసాగుతున్నారని తన సన్నిహితులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. గతంలో తనకు అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎప్పటికీ కృతజ్ఞుడినే అన్నారు. గతంలో నియోజకవర్గ పరిధిలో నా అభిమానులు పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారవలసి వచ్చింది చెప్పారు. సోమవారం (నేడు) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు.

