- అచ్చెన్నాయుడు
జగన్మోహన్ రెడ్డి నోరు పెద్ద అబద్ధాల పుట్టని.. ఆయన నోటినుంచి అబద్ధం తప్ప మరోటి రాదని, ప్రజల్ని మాయ మాటలతో మోసగించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యని, గతంలో ప్రతిపక్షనేతగా టీడీపీ ప్రభుత్వంపై, చంద్రబాబు పాలనపై విషప్రచారంచేసి, లెక్కకు మిక్కిలి హామీలిచ్చిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కి, తన చేతగానితనం.. అసమర్థతను కప్పిపుచ్చేందుకు టీడీపీపై, చంద్రబాబుపై నీతిమాలిన ప్రచారం చేస్తున్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!
“ 2019 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి మద్యాన్ని నిషేధిస్తానని ప్రచారం చేశాడు. చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిస్తోందని.. విచ్చలవిడిగా బె ల్టు షాపులు నిర్వహిస్తోందని.. దోసిళ్లతో టీడీపీప్రభుత్వమే మద్యం తాగిస్తోందని ఊరువాడా తిరిగి విషప్రచారం చేశాడు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా తన మేనిఫెస్టో పత్రం పట్టుకొని అది తనకు బైబిల్.. ఖురాన్ అని దాన్ని తూచా తప్పకుండా అమలుచేస్తానని ప్రగల్భాలు పలికాడు. జగన్ బాటలోనే అతని పార్టీ నేతలు.. మంత్రులు కూడా వైసీపీ మేనిఫెస్టోపై ఊకదంపుడు ఉపన్యా సాలిచ్చారు.
చంద్రబాబు బెల్టుషాపులతో మద్యం విక్రయిస్తున్నాడన్న పెద్దమనిషి.. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా మద్యాన్ని తనపార్టీ వారితో డోర్ డెలివరీ చేయిస్తున్నాడు
జగన్ తన మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ప్రధానమైనది దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పడం. కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోందని.. మానవ సంబం ధాలు మద్యం మహమ్మారితో ధ్వంసం అవుతున్నాయని.. దశలవారీగా మద్యా న్ని నిషేధిస్తానని..కేవలం స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా మద్యం లేకుండా చేస్తా నని గొంతు చించుకొని మరీ ఊదరగొట్టాడు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక మద్యం ఊసే ఎత్తకుండా నకిలీ మద్యాన్ని అధికధరకు అమ్మిస్తూ పేదల జీవితాలు రోడ్డు న పడేశాడు. ప్రతిపక్షనేతగా బుద్ధి ఉన్నవాడు ఎవడూ చంద్రబాబులాగా మద్యాన్ని అమ్మడన్న జగన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ఏ బుద్ధిలేనితనంతో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీమద్యం అమ్మకాలు సాగిస్తున్నాడని ప్రశ్నిస్తున్నాం. (ప్రతిపక్షనేతగా జగన్ రెడ్డి టీడీపీప్రభుత్వంపై నిందలేస్తూ మద్యంపై మాట్లాడిన వీడియోలను ఈ సందర్భంలో అచ్చెన్నాయుడు విలేకరులకు చూపించారు) తెలుగుదేశం ప్రభుత్వంలో బెల్టు షాపులు ఉన్నాయన్న పెద్దమనిషి.. తన పాలనలో ఏకంగా మద్యాన్ని డోర్ డెలివరీ చేసే స్థాయికి మద్యం విక్రయాలు పెంచాడు. సినిమా హాళ్ల వద్ద బ్లాక్ టిక్కెట్స్ అమ్మే దానికంటే దారుణంగా జగన్ రెడ్డి ఇంటింటికీ తన పార్టీ రు. వాలంటీర్లతో నాసిరకం మద్యం సరఫరా చేయిస్తు న్నాడు. రాష్ట్రంలో జరుగుతున్న నాసిరకంమద్యం వ్యాపారానికి కర్త..కర్మ…క్రియా జగన్ రెడ్డే. కల్తీ మద్యం తయారు చేయించేది జగన్ రెడ్డే.. దాన్ని తిరిగి విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ అమ్మిస్తున్నది తానే. వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న నాసి రకం మద్యం వల్ల రాష్ట్రంలో 35లక్షల మంది పేదలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. జగన్ అమ్ముతున్న జేబ్రాండ్ మద్యం వల్ల వారంతా కాలేయ, హృద్రోగ, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో ఆసుపత్రులపాలై బతుకుజీవుగా అని రోదిస్తున్నారు.
నోరుతెరిస్తే జగన్ రెడ్డి నా ఎస్సీ..నా ఎస్టీ.. నా బీసీ.. నా మైనారిటీలు అంటాడు.. తన కల్తీ మద్యానికి వారినే ఎక్కువగా బలిచేస్తున్నాడు.
ఈ ముఖ్యమంత్రి నోరుతెరిస్తే నాఎస్సీలు.. నాఎస్టీలు.. నా బీసీలు.. నా మైనారిటీలు అంటాడు. లోలోపలేమో తన దోపిడీ.. దుర్మార్గాలతో అదే వర్గాలను బలితీసుకుంటున్నాడు. జగన్ రెడ్డి కల్తీ మద్యానికి ఎక్కువగా బలైపోతున్న వారిలో దళితులే ముందువరుసలో ఉన్నారు. తరువాతి స్థానాల్లో బీసీ.. మైనారి టీలు ఉన్నారు. నిత్యం రెక్కల కష్టం చేయడం.. వచ్చిన అరకొర సొమ్ములో తమ కష్టం తాలూకా బాధను మర్చిపోవడానికి మద్యం సేవించడం అనేది అందరూ చేసేదే. అలా రెక్కాడితే గానీ డొక్కాడని 35 వేలమందిని తన నాలుగేళ్ల పాలనలో జగన్ రెడ్డి కల్తీమద్యంతో బలితీసుకున్నాడు. జగన్ రాష్ట్రంలో అమ్ముతున్న మద్యం విషం కంటే ప్రమాదకరమైందని ఇప్పటికే తేలింది. టీడీపీనేతలు గతంలో పరిశోధనశాలల్లో పరీక్షించి మరీ జేబ్రాండ్ మద్యంలోని హానికారక రసాయనాల గుట్టుమట్లను ప్రజల ముందు ఉంచారు. అలాంటి మద్యం అమ్ముతూ..పేదల జీవితాలు తన ధనదాహానికి బలిచేస్తూ.. జగన్ రెడ్డి తన ఖజానా నింపుకుం టున్నాడు.
టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో మద్యం అమ్మకాలపై రూ.50 వేలకోట్లు వస్తే.. జగన్ రెడ్డి నాలుగేళ్లపాలనలో రూ.2.10 లక్షలకోట్లు వచ్చాయి. కేవలం నగదుకే నాసిరకం మద్యం విక్రయిస్తూ జగన్ రెడ్డి లక్షకోట్లు కొల్లగొట్టాడు.
టీడీపీప్రభుత్వంలో మద్యం అమ్మకాలపై రాష్ట్ర ఖజానాకు ఐదేళ్లలో రూ.50వేలకోట్ల ఆదాయం వస్తే, జగన్ రెడ్డి నాలుగేళ్లపాలనలో నాసిరకం మద్యం అధికధరకు అమ్మి పేదల నుంచి రూ.1,10,000కోట్లు కొల్లగొట్టాడు. మరో లక్షకోట్లు లెక్కల్లో చూపకుండా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన తాడేపల్లి ఖజానాకు చేరవేశాడు. నాసి రకం మద్యం తయారీ.. సరఫరా.. అమ్మకాలు.. అన్నీ జగన్ రెడ్డి కనుసన్నల్లో తన పార్టీ వారే చేస్తున్నారు. టీడీపీప్రభుత్వంలో రూ.60లు అమ్మిన క్వార్టర్ మద్యాన్ని జగన్ రెడ్డి రూ.200 నుంచి రూ.250 కు విక్రయిస్తున్నాడు. అది కూడా దారుణమైన కల్తీ మద్యం. ధరలు ఎందుకు పెంచా వయ్యా అంటే ప్రజలు మద్యం తాగకూడదనే పెంచానని తన దిక్కుమాలిన చర్య ల్ని సమర్థించుకున్నాడు. ధరలు పెంచినందువల్ల రాష్ట్రంలో ఎంతశాతం మద్యం విక్రయాలు తగ్గాయో ముఖ్యమంత్రి చెప్పాలి. ధరలు పెంచడం తనదోపిడీ కోసం చేశాడు తప్ప… నిజంగా పేదలతో మద్యం మాన్పించడానికి కాదు. 2020-21తో పోలిస్తే ఈ ఏడాది మద్యం అమ్మకాలు 23శాతం పెరిగాయి. ఈ లెక్కలన్నీ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. అధిక ధరకు నాసిరకంమద్యం అమ్మడంతో పాటు.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సిగ్గు, శరం వదిలేసి బేవరేజేస్ కార్పొరేషన్ ద్వారా మద్యంపై వచ్చే ఆదాయాన్ని 15 ఏళ్లు తాకట్టుపెట్టి రూ.30 వేలకోట్ల అప్పులు తెచ్చాడు. ఏ ప్రభుత్వం వచ్చినా మద్యం ధరలు తగ్గించే వీలులేకుండా మద్యం అమ్మకాలను తన అప్పుల చట్రంలో ఇరికించాడు.
జగన్ రెడ్డికి డబ్బే ముఖ్యం.. పేదల ప్రాణాలు కాదు అనడానికి తాను విచ్చలవిడిగా అమ్మిస్తున్న కల్తీమద్యమే నిదర్శనం
మద్యం ధరలు పెంచి..కల్తీ మద్యం ఎందుకు అమ్ముతున్నావని ప్రశ్నిస్తే టీడీపీ ప్రభుత్వంలో పెట్టిన మద్యం కంపెనీలే తప్ప కొత్తగా తనహాయాంలో ఎక్కడా వేటికి అనుమతులు ఇవ్వలేదని జగన్ రెడ్డి అడ్డగోలుగా బుకాయిస్తున్నాడు. రాష్ట్రంలో నడుసున్న మద్యం కంపెనీలన్నీ జగన్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అవన్నీ ఆయన నాయకత్వంలో పుట్టుకొచ్చినవే. కాదని నిరూపించే ధైర్యం జగన్ రెడ్డికి ఉంటే.. బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తున్నా. కల్తీమద్యాన్ని అధిక ధరకు అమ్మిస్తూ.. పేదల ప్రాణాల్ని తన ధనదాహానికి బలిచేస్తున్న జగన్ రెడ్డి దోపిడీపై ప్రజలంతా ఆలోచన చేయాలి. డబ్బే జగన్ రెడ్డికి ముఖ్యం కానీ.. ప్రజల ప్రాణాలు.. రాష్ట్ర ప్రయోజనాలతో జగన్ కు పనిలేదు.
రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాకే 2024ఎన్నికల్లో ప్రజల్ని ఓట్లు అడుగుతానన్న హమీకి కట్టుబడతావా జగన్ రెడ్డి?
ఎన్నికల మేనిఫెస్టో తనకు బైబిల్ అన్న జగన్ రెడ్డి.. దానిలో హామీ ఇచ్చినట్టుగా ఎందుకు మద్యాన్ని నిషేధించలేదో ప్రమాణం చేసి జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో పూర్తిగా మద్యాన్ని నిషేధించాకే 2024 ఎన్నికల్లో ప్రజల్ని ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ రెడ్డి, తనమాటకు కట్టుబడతాడో లేదో చెప్పాలి. ముఖ్యమంత్రి.. ఆయన తాబేదారులు.. తాడేపల్లి ప్యాలెస్ లోని పెద పాలేరు తక్షణమే మద్యం అమ్మకాలు.. జగన్ హామీపై ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు ఇచ్చిన హామీల్లో జగన్ 30శాతం కూడా నెరవేర్చలేదు. అధికారం చేతిలో ఉందని.. అవినీతిమీడియా తన అధీనంలో ఉందని.. జగన్ రెడ్డి ప్రజల్ని వంచించి మరలా సీఎం కావడానికి కుట్రలు చేస్తున్నాడు. ప్రజలు వాస్తవా లు గ్రహించి అప్రమత్తం కావాలని.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జగన్ రెడ్డిని.. వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిస్తున్నాం.
టీడీపీ-జనసేన రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై స్పందించగానే జగన్ రెడ్డి కొత్త రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నట్టు చెబుతున్నాడు. మద్యనిషేధం హామీలానే రోడ్ల నిర్మాణాన్ని అమలు చేస్తాడేమో!
టీడీపీ-జనసేన సంయుక్త కార్యక్రమాలపై ప్రజల్లో ఇరుపార్టీలకు లభిస్తున్న మద్ధ తుపై జగన్ అవినీతి మీడియా సాక్షి విషం చిమ్ముతోంది. జగన్ రెడ్డికి అధికారం కళ్లకెక్కి వాస్తవాలు కనిపించడం లేదు.. మరి జర్నలిజం ముసుగేసుకున్న జగన్ కరపత్రిక సాక్షికి ఎందుకు కనిపించడంలేదు? రాష్ట్రంలో గుంతలమయమైన రోడ్లు.. దెబ్బతిన్న రహదారులు సాక్షి మీడియాకు..వైసీపీనేతలు..మంత్రులకు కనిపించడం లేదా? రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై..ప్రజలు పడుతున్న బాధలపై టీడీపీ-జనసేన స్పందించాకే జగన్ రెడ్డికి, రోడ్లుభవనాలశాఖ మంత్రికి రోడ్ల నిర్మాణం గుర్తొచ్చిందా? టెండర్లు పిలుస్తున్నట్టు..రేపోమాపో కొత్తరోడ్లు వేసే పనులు మొదలవుతున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త అబద్ధం చెప్పడం.. కొత్త వేషాలెయ్యడం జగన్ రెడ్డికి.. వైసీపీనేతలు.. మంత్రులకు అలవాటుగా మారింది. మద్య నిషేధం హామీలానే కొత్త రోడ్ల నిర్మాణం కూడా ఉంటుందా అని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు హాయాంలో మద్యం అమ్మకాలపై వచ్చిన ఆదాయ వివరాలు.. తన హాయాంలో వచ్చిన ఆదాయ వ్యయాలు బయటపెట్టే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి ఉన్నాయా? మద్యం దుకాణాల్లో ఎందుకు డిజిటల్ చెల్లింపులు అమలు చేయడంలేదో ..నగదు ద్వారా జరిగే అమ్మకాలపై వచ్చే సొమ్ములో ఎక్కువ భాగం తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతోందో లేదో జగన్ రెడ్డి సమా ధానం చెప్పాలి. నవరత్నాల్లో ఒక రత్నమైన మద్యనిషేధం హామీని ఎందుకు నెరవేర్చలేదో కూడా జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. టీడీపీప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ రెడ్డి నాలుగేళ్లలో సాగించిన మద్యం దోపీడీపై న్యాయవిచారణ జరిపిస్తుంది. కల్తీమద్యం అమ్మకాలు నిషేధించి.. నాణ్యమైన మద్యం తక్కువధరకు లభించేలా చూస్తాం. రాష్ట్రంలోని రోడ్లదుస్థితిపై టీడీపీ-జనసేన చేపట్టిన కార్యక్రమం ముగిశాక భవిష్యత్ లో నిర్వహించే కార్యక్రమాల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం.” అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.