వ్యాధులను ఎదుర్కునే ఉచిత దివ్య ఔషధం పరుగు
— నగరంలో క్రీడా కార్యకలాపాలు పెరగడం అభినందనీయం
— క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది
జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
అంతర్జాతీయ క్రీడాంశాలలో ప్రసిద్ధి పొందిన క్రీడాకారులకు నిలయం మైన ఎన్ టి ఆర్ జిల్లా ను మారదాన్ న్నిర్వహణ లో ప్రపంచ పటం నందు నిలిపేందుకు విజయవాడ రన్నర్స్ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యంలో 8వ విజయవాడ మారథాన్ పేరుతో “గో లాంగ్… గో స్ట్రాంగ్” నినాదంతో ఆదివారం గాంధీనగర్ లోని జింఖానా మైదానంలో మారథాన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మారథాన్ అంటే ఆఫ్రికా దేశాలే గుర్తుకొస్తాయన్నారు. ఇందుకు కారణం ఆయా ప్రాంతాలలో ఉన్న భౌగోళిక, జన్యుపరమైన అంశాలే కారణమన్నారు. కానీ మన నగరంలో కూడా మారథాన్ పట్ల ఆసక్తి కలిగిన యువతీ యువకులు, అంతే స్థాయిలో 60 సంవత్సరాలు పైబడిన వారు కూడా ఇందులో పాల్గొనడం చూస్తోంటే సమాజంలో ఆరోగ్యం పట్ల పెరుగుతున్న అవగాహనే కారణమన్నారు. ఇటువంటి క్రీడాంశాలలో పాల్గొనే వారికి సహనం, ఓర్పు, మానసిక దృఢత్వం, శారీరక పటుత్వం పెరగడంతోపాటు మరెన్నో వ్యాధుల నివారణకు పరుగు అనేది ఒక ఉచిత ఔషధం అన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బరువు తగ్గటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఎముకలు, కండరాలు దృఢంగా తయారు చేసుకోవడం వంటి ఎన్నో అంశాలు ఈ పరుగు ద్వారా మనం పొందవచ్చన్నారు. అదే సమయంలో హృదయ సంబంధ, అల్జీమర్స్ వంటి వ్యాధులను నిరోధించేందుకు ప్రతిరోజు కనీసం ఒక కిలోమీటర్ కి తగ్గకుండా ప్రతి ఒక్కరు ఉదయపు నడక లేదా పరుగును అలవాటు చేసుకోవాలన్నారు. ప్రతిరోజు పరుగు వల్ల ఫిట్నెస్ కోసం జిమ్ లకు కూడా వెళ్లే అవసరం ఉండదన్నారు. పరుగు తీయడం వలన శరీరం నుంచి వచ్చే చెమట ద్వారా కొన్ని వ్యర్థ పదార్థాలు బయటకు పోవడంతో మనసుకు ఎంతో ఉల్లాసం కలుగుతుందన్నారు. వీటితోపాటు మరెన్నో వ్యాధులు ప్రతీరోజు పరుగు తీయడం ద్వారా నయమవుతాయని ఎన్నో పరిశోధనలు తేల్చాయన్నారు. మెరుగైన నిద్రకు రోగనిరోధక శక్తి పెరిగేందుకు కూడా ఈ పరుగు తీయడం దోహదపడుతుందన్నారు. విజయవాడ రన్నర్స్ నిర్వహణలో దేశంలోని 11 రాష్ట్రాల నుంచి 2000 మందికి పైగా రన్నర్స్, వారిలో వివిధ ప్రభుత్వ శాఖకు చెందిన ఉన్నతా ధికారులు కూడా ఇందులో పాల్గొనడం నగరానికి గర్వకారణం అన్నారు. 5,10, 21 కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టేందుకు వచ్చిన వారిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం ఎంతో సముచితమన్నారు. మన నగరంలో ఇప్పటికే చదరంగం, విలువిద్య, హాకీ క్రీడలలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన క్రీడాకారులు ఉన్నారని గుర్తు చేశారు. ఇదే కోవలో మారధాన్ లో కూడా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు కావాలని అభిలషించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వివిధ క్రీడాంశాలలో యువతీ యువకులకు శిక్షణ ఇచ్చేందుకు నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో నగరం కేంద్రంగా ఎన్నో క్రీడా కార్యకలాపాలు ప్రభుత్వ, ప్రైవేటు క్రీడా అకాడమీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నారు. విజయవాడ రన్నర్స్ నిర్వాహకులు దీపక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు కలెక్టర్ డిల్లీరావు జ్ఞాపికను, ప్రశంసా పత్రాన్ని అందజేశారు నగరానికి చెందిన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థి విద్యార్దిని యువ క్రీడాకారులు యువతి యువకులు పాల్గొన్నారు.