ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మన్నవ యామిని….
బుట్టాయగూడెం:మహిళా హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు) ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండల కేంద్రంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మన్నవ యామిని మాట్లాడుతూ మహిళా సాధికారిత సాధించడానికి అందరం
ఏకోన్ముఖులై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతన చట్టం ఉన్నా అమలు కాకపోవడం దురదృష్టకరం అన్నారు. ఉద్యోగం, పదోన్నతులు, శిక్షణ వంటి అంశాలలో నేటికీ వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కాలరాస్తుందని విమర్శించారు. ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తర్వాత మహిళలపై దాడులు ఎక్కువ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తు మణిపూర్ లో గిరిజన మహిళలను
వివస్త్రలను చేసి ఊరేగించినా దోషులపై ప్రధాని మోడీ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. లైంగిక, యాసిడ్ దాడులు అత్యాచారాలు, హత్యలు, హెచ్చు మీరాయన్నారు. రాబోయే ఎన్నికలలో మహిళా కంటక పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు వరక శ్యామల మాట్లాడుతూ సమాజంలో మహిళలు కుటుంబ పోషణలో పురుషులతో సమానంగా ఆర్థికపరమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నేటి సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు కరటం సీతా మహాలక్ష్మి, కౌన్సిల్ సభ్యులు షేక్ లాల్ బి, గోలిమి స్వప్న, ఎల్లి బోయిన లక్ష్మి, గుండి నాగరత్నం, సోడే చిన్నమ్మి, కొమరం గౌతమి, సోడే మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.