భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ పాశ్చాత్య దేశాల్లోని ప్రజాస్వామ్య భావన కన్నా చాలా ప్రాచీనమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అందువల్లే భారత్‌ను ‘ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి’గా పిలుస్తారని ..భారత రాజ్యాంగ పీఠికలో ‘మనం, భారత ప్రజలం’ అని ప్రారంభమవుతుందని, దాంతోనే మన రాజ్యాంగ స్వభావం తేటతెల్లమవుతోందని అన్నారు.
ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. సుమారు 40ఏళ్ల తర్వాత రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు. కర్తవ్యపథ్‌కు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వందనాన్ని స్వీకరించారు. సుమారు 13,000 మంది అతిథులు ఈ వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు.
భారత రత్నపురస్కారానికి మరణానంతరం ఎంపికైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాకూర్‌కు ఆమె నివాళులర్పించారు.మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంతో ఆదర్శప్రాయమైన లింగ సమానత్వం దిశగా దేశం పురోగతి సాధిస్తోందని.. నారీ శక్తి వందన్ అధినియం మహిళా సాధికారతకు విప్లవాత్మకమైన సాధనంగా నిరూపించబడుతుందని తాను నమ్ముతున్నానన్నారు. అమృత్ కాల్’లో అనూహ్యమైన సాంకేతిక మార్పులు జరుగుతాయని. కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక చొరవలు మన రోజువారీ జీవితాల్లో భాగం కానున్నాయని అన్నారు.
మొదటిసారి సుమారు 100 మంది మహిళా కళాకారులు భారతీయ సంగీత వాద్య పరికరాలైన శంఖం, నాదస్వరం, నగారాలను వినిపించారు. సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన ఇచ్చారు. మొత్తం మహిళలతో కూడిన ట్రై సర్వీస్ బృందం కర్తవ్య మార్గ్‌లో కవాతు చేయడం ఇదే మొదటిసారి. నారీ శక్తి పేరుతో మహిళా పైలెట్లు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) మహిళా సిబ్బంది ప్రదర్శన అనంతరం శకటాలను ప్రదర్శించారు.