Saturday, November 8, 2025

Creating liberating content

టాప్ న్యూస్భరద్వాజ తీర్థం గాలికి వదిలారు…

భరద్వాజ తీర్థం గాలికి వదిలారు…

  • భరద్వాజ తీర్థం పాడైపోయింది… పిచ్చి మొక్కలే పరిసరాల అలంకారం
  • పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి గాలికి వదిలిన దేవస్థానం అధికారులు
  • కార్తీక మాసం మొదలైనా భక్తుల కదలికే లేదు భరద్వాజ తీర్థం దుర్వాసనలో మునిగింది
  • పవిత్ర తీర్థం పక్కనే చెత్త, పిచ్చి మొక్కల రాజ్యం
  • నక్షత్ర వనం పేరు మిగిలి… ఊయాల జ్ఞాపకం మాత్రమే!
  • పిల్లల ఆటస్థలంగా ఉండేది, ఇప్పుడు పాడుబడిన ప్రదేశం స్థానికుల ఆగ్రహం
  • తీర్థాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చి మాట తప్పిన అధికారులు
  • పండుగల టైంలో కళకళలాడే ప్రదేశం ఇప్పుడు నిశ్శబ్దంలో …

(పెరిమిడి రఘు, ప్రజాభూమి ఆర్సిఇంచార్జ్, శ్రీకాళహస్తి)

భరద్వాజ తీర్థం పక్కనే కూర్చుని, నీటి అలలు తాకే చల్లని గాలిని ఆస్వాదించేవారు భక్తులు… చిన్నపిల్లల నవ్వులు, యాత్రికుల సందడి, నక్షత్ర వనంలో ఊయలల ఊగిసలాట… ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలే. ఒకప్పుడు కళకళలాడిన ఈ తీర్థం నేడు పిచ్చి మొక్కలతో నిండిపోయి పాడుబడిపోయింది. కార్తీక మాసం మొదలైనా, ఈ పవిత్ర ప్రదేశం వైపు భక్తుల కాలు కూడా తిరగడం లేదు. ఇదేనా అభివృద్ధి అని శ్రీకాళహస్తి ప్రజలు మండిపడుతున్నారు. దేవస్థానం అధికారులు భరద్వాజ తీర్థాన్ని పర్యాటక కేంద్రంగా మార్చుతామని హామీ ఇచ్చి మాట తప్పారంటూ విమర్శిస్తున్నారు…పూర్తి వివరాలు వెళితే…

శ్రీకాళహస్తి పరిసర ప్రాంతంలోని భరద్వాజ తీర్థం ఒకప్పుడు యాత్రికులు, స్థానికులతో కళకళలాడేది. దేవస్థానం ఆధ్వర్యంలో దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన అధికారులు, ఇప్పుడు ఆ మాటను గాలికి వదిలేశారు. కార్తీక మాసం ప్రారంభమైనా తీర్థం పరిసరాల్లో ఒక్క కదలిక కనిపించడం లేదు.

పిచ్చి మొక్కలతో నిండిన తీర్థం పరిసరం

ఒకప్పుడు సేదతీరే ప్రదేశంగా ఉన్న లోబావి ఇప్పుడు పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఎక్కడ చూసిన పాడుబడ్డ ఆట వస్తువులు, పచ్చిక మొక్కలతో కప్పబడి ఉన్న మార్గాలు మాత్రమే కనిపిస్తున్నాయి. యాత్రికులు రావాలన్న ఆసక్తి కోల్పోతున్నారు. స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

దేవస్థానం అధికారులపై మండిపడుతున్న ప్రజలు

భరద్వాజ తీర్థం, నక్షత్ర వనం వంటి ప్రదేశాలు పండగల సమయంలో యాత్రికులతో కళకళలాడేవి. ఇప్పుడు ఆ దృశ్యం కనిపించడం లేదు.
పండగల టైంలో ఇక్కడ సందడి ఉండేది… ఇప్పుడు పిచ్చి మొక్కలే కనిపిస్తున్నాయి. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నక్షత్ర వనం పేరు మిగిలి, రూపం మాయమైంది
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఈవోగా పెద్దిరాజు ఉన్న సమయంలో నక్షత్ర వనంలో చిన్నపిల్లల కోసం ఉయ్యాలు, ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. అప్పట్లో పిల్లలు ఉత్సాహంగా ఆడుకునేవారు. ఇప్పుడు అవన్నీ పాడైపోయి, ఉయ్యాలు కూడా కనిపించకుండా పోయాయి.

దుర్గంధంతో యాత్రికుల ఇబ్బంది…

భరద్వాజ తీర్థంలోని నీరు పూర్తిగా పాడైపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. నీటి స్వచ్ఛత లేకపోవడంతో యాత్రికులు అక్కడ నిలబడలేకపోతున్నారు. ఇంత పవిత్రమైన తీర్థం ఈ స్థాయికి దిగజారడం దేవస్థానం నిర్లక్ష్యానికి నిదర్శనం.అంటూ ప్రజలు మండిపడుతున్నారు.

మహాశివరాత్రికి ముందే అభివృద్ధి చేయాలి

స్థానికులు, భక్తులు దేవస్థానం అధికారులను వేడుకుంటున్నారు ఇంకనైనా వచ్చే మహాశివరాత్రికి ముందే తీర్థాన్ని శుభ్రపరచి, ఆట వస్తువులు పునరుద్ధరించి, సుందరంగా తీర్చిదిద్దాలి. భక్తులకు, స్థానికులకు ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.అని విజ్ఞప్తి చేస్తున్నారు.

తిరిగి రావాలి…

ఒకప్పుడు యాత్రికులతో సందడిగా, పిల్లల నవ్వులతో నిండిన భరద్వాజ తీర్థం ఇప్పుడు క్షీణావస్థలో ఉంది. అధికారులు కనీసం ఇప్పుడు అయినా చొరవ చూపి పాత కీర్తి తెచ్చిపెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article