అయోధ్య :ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు. కొంతమంది రామభక్తులు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేసి, రామ్‌లల్లాను దర్శించుకోవడానికి ఎదురుచూస్తున్నారు.
ప్రాణప్రతిష్ఠ పూర్తైన తర్వాత జరిగే ప్రభాత కాల దర్శనం కావటంతో భక్తులు వేల సంఖ్యలో అయోధ్య రాముడి ఆలయానికి చేరుకున్నారు. అర్థరాత్రి నుంచి ప్రధాన ద్వారం వద్ద వేలాదిగా రామ భక్తులు దర్శనం కోసం నిలబడ్డారు. స్వామివారి దర్శనానికి టికెట్లు లేకపోవటం..ఐదువందల ఏళ్ల తర్వాత రాముడికి గుడి కట్టి భక్తులకు దర్శన అవకాశం కల్పించటంతో తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ఊహించని స్థాయిలో అయోధ్యకు భక్తులు చేరుకున్నారు.
ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ పెద్దలు చెబుతున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచుతారని తెలిపారు. ఆలయంలో రెండుసార్లు హారతిని దర్శించుకోవచ్చు. ఉదయం 6.30 గంటలకు, రాత్రి 7.30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు.