అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్ రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. నేడు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో జరిగిన నేషనల్ ఓటర్స్ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై, సీఈఓ వికాస్ రాజ్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కౌశిక్ రెడ్డి ప్రసంగాన్ని ప్రస్తావించారు.
‘‘ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి అన్నారు. ఎన్నికల కమిషన్ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. ఓటర్లను ఎవరూ బెదిరించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఓటు అనేది మోస్ట్ పవర్‌ఫుల్ ఆయుధం. ప్రజాస్వామ్యం బతకాలంటే ఓటు వేయాలి. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుంది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి ’’ అని గవర్నర్ అన్నారు. అనంతరం 18 ఏళ్లు పూర్తి చేసుకొని కొత్తగా ఓటును పొందిన మనీషా అనే యువతికి గవర్నర్ తమిళిసై ఓటర్ ఐడీని అందించారు. అలాగే, జనరల్ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన పలువురు ఐఏఎస్ , ఐపీఎస్, వలంటీర్లకు గవర్నర్ సర్టిఫికేట్ అందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఈవో వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ విచ్చేశారు.