గొల్లప్రోలు : బి ఓ సి సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని పలు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో ఏపీ ఆర్ సి ఎస్, ఏ.ఐ.ఎఫ్.టి.యు ప్రజా సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఏఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కుంచే అంజిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్ సి ఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, ఏఐఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబులు మాట్లాడుతూ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్రం విడిపోయిన గత పదేళ్లలో రాష్ట్రం అధోగతి పాలయిందని, అధిక ధరలు, పన్నుల భారం, నిరుద్యోగం వంటి సమస్యలు పెరిగిపోయాయన్నారు.భవన ఇతర నిర్మాణ రంగ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, సంక్షేమ పథకాలను అమలు చేయాలని, సంక్షేమ బోర్డు నుండి వాడుకున్న నిధులను తిరిగి సంక్షేమ బోర్డుకు జమ చేయాలని డిమాండ్ చేశారు.వ్యవసాయ రంగం సంక్షోభం, వలన గ్రామాలలో రైతులు, కౌలు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతు కూలీలు పట్టణాలకు వలసలు పోతున్నారన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిచిన నూతన ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించాలని, . విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ,విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులు విభజన చట్టంలోని హామీలను అమలు చేసే విధంగా కృషి చేయాలని,ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఏపీ ఆర్ సి ఎస్, ఏ ఐ ఎఫ్ టి యు ప్రజాసంఘాలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ టు యు జిల్లా నాయకులు డి నారాయణమూర్తి, గుడాల చార్లెస్, కేశవరపు వీరన్న, గొర్ల శివ గొర్ల శివ, బొడ్డు వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.