విజయోత్సవ సభలో టిడిపి నేతలు
హిందూపురంటౌన్
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం అనాదిగా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉంటుందని, ఆ విషయాన్ని టిడిపి కార్యకర్తలు మరోసారి రుజువు చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జేవిఎస్ పారడైజ్ లో జేవీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో హ్యాట్రిక్ సాధించడం పట్ల విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాసరావు, డాక్టర్ సురేంద్ర, టిడిపి జిల్లా అధ్యక్షులు గొల్ల కుంట అంజనప్ప, సీనియర్ నాయకులు జేఈ వెంకటస్వామి, నెట్టప్ప, ఆర్ఎంఎస్ షఫీవుల్లా తదితరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెవి అనిల్ కుమార్ మాట్లాడుతూ, గత 1983 నుండి హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటుందన్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణ పట్టుదలతో కృషిచేసి నందమూరి బాలకృష్ణ విజయంలో పాలుపంచుకున్నారని కొనియాడారు. హిందూపురం అంటేనే తెలుగుదేశం పార్టీ అని, ఈ పంతాను ఎమ్మెల్యే అదే తరహాలో కొనసాగిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందాలన్నా, నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలన్న ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందని హర్షధ్వానాల నడుమ నడుమ పేర్కొన్నారు. బాలకృష్ణ విజయం కోసం కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు, ఓటర్లకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్లు పార్టీ అనుబంధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.