లేపాక్షి: 2024- 25 విద్యా సంవత్సరంలో అర్హులైన విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని మండల విద్యాధికారులు,నాగరాజు కుళ్లాయప్పలు తెలిపారు. ఈనెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఒకటవ తరగతి ప్రవేశానికి మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థి ఆధార్ కార్డ్ ఆధారంతో సంబంధిత విద్యా పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ల అనంతరం అర్హులైన వారిని ప్రైవేట్ పాఠశాలల్లో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన విద్యార్థుల వివరాలు సంబంధిత పాఠశాలలో కానీ లేదా సచివాలయంలో కానీ తెలుసుకొని ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా జరుగుతుందని ఎంఈఓ నాగరాజు తెలిపారు. పాఠశాలకు ఒక కిలోమీటరు పరిధిలోని విద్యార్థుల దరఖాస్తులను మొదట పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత మూడు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందన్నారు. పై పాఠశాలల్లో ఒకటి నుండి మూడు కిలోమీటర్ల పరిధిలోని చిన్నారుల అక్కలు , అన్నలు చదువుతున్నట్లయితే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక కిలో మీటర్ లోపల జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఒకటవ తరగతి ప్రవేశాన్ని కోరుతున్నట్లయితే లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందని మండల విద్యాధికారులు నాగరాజు, కుల్లాయప్పలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశానికి సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ లు క్రిష్టప్ప, ఆదినారాయణ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.