- జిల్లాలో 13,625 మందికిగాను 13,455 మంది (98.75 శాతం) హాజరు
- మొదట్నుంచి ప్రతి దశలోనూ అధికారుల అప్రమత్తత
- పరీక్ష నిర్వహణ తీరును నిరంతరం పర్యవేక్షించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆదివారం నిర్వహించిన నీట్-2025 పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, ఎన్‌టీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లాలో 28 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరీక్ష జరగ్గా.. 13,625 మంది అభ్యర్థులకుగాను 13,455 మంది (98.75 శాతం) హాజరైనట్లు ఆయన వెల్లడించారు.
కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం నగరంలోని పీఎస్‌సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, అభ్యర్థుల బయోమెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లు, సీటింగ్ అరేంజ్‌మెంట్ సరిగా ఉందా? లేదా? తదితర విషయాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరు కార్యాలయంలో మాట్లాడుతూ బయోమెట్రిక్ హాజరు, కంట్రోల్ రూమ్ విధులు, సీటింగ్ అరేంజ్‌మెంట్, వీడియోగ్రఫీ, సీల్డ్ కవర్స్, నివేదికలు, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ నిర్వహణ తదితరాలపై నిర్వహణ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మక పరీక్షను లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించామన్నారు. సిటీ కోఆర్డినేటర్, సెంటర్ సూపరింటెండెంట్, డిప్యూటీ సెంటర్ సూపరింటెండెంట్, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు.. ఇలా ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైనందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.