- 1,801 మంది అభ్యర్థులకుగాను 1,153 మంది హాజరు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
- విజయవాడ :
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభం కాగా ఆదివారం రెండో రోజు ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని.. జిల్లాలో మొత్తం 1,801 మంది అభ్యర్థులకుగాను 1,153 మంది (64.02 శాతం) హాజరైనట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు.ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. రాత పరీక్ష (ట్యాబ్ ఆధారిత, డిస్క్రిప్టివ్) ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరుగుతుంది. విజయవాడలో ఆరు కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు ఉన్నాయని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఉదయం ఈదురుగాలులతో కూడిన వర్షం పడినా.. యుద్ధప్రాతిపదికన స్పందించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశామన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, మెడికల్ క్యాంప్ తదితర ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పరీక్ష నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని లైజనింగ్ అధికారులు, అసిస్టెంట్ లైజనింగ్ అధికారులు, సూపర్‌వైజర్లు తదితరులను ఆదేశించినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.