పనుల కోసం ప్రజలు కార్యాలయాలకు వచ్చే పరిస్థితి కల్పించకూడదు
వాట్సాప్ గవర్నెన్స్ వినియోగిత పెరగాలి
వర్క్‌ఫ్రం హోం ఉద్యోగాల కల్పన వేగవంతం చేయాలి
-ఆర్టీజీఎస్‌పై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, మే 5 :- ప‌్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండకూడదని, ప్రభుత్వ సేవలన్నీ పౌరులకు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కార్యకలాపాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే ప్రజలు ప్రభుత్వం నుంచి అన్ని సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృతంగా దీని గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం అన్ని సేవలు కూడా ప్రజలు ఎలాంటి అవరోధాలు లేకుండా ఆన్‌లైన్‌లో పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈ దిశగా తమ కార్యకలాపాలను మెరుగుపరచుకోవాలన్నారు. డేటా లేక్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. డ్రోన్‌ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు కల్పించాలని, ప్రజలు డ్రోన్ సేవలు విరివిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డ్రోన్‌ల ద్వారా ఎన్ని యూస్ కేసెస్ అందించగలమనేది ప్రజలకు వివరించి వారు ఆయా సేవలు పొందగలిగే ఏర్పాట్లు చేయాలన్నారు. యూస్ కేసెస్ అందించే సంస్థలు, ప్రభుత్వ విభాగాలతో ఒక వర్క్‌షాపు పెట్టి ప్రభుత్వ శాఖలు, అధికారులకు కూడా దీనిపైన అవగాహన పెరిగేలా చేయాలని సూచించారు. దోమల నివారణకు పురపాలక శాఖ, ప్రజారోగ్య శాఖలు డ్రోన్‌లను ఎక్కువగా వినియోగించాలని సీఎం ఆయా శాఖల అధికారులకు సూచించారు. వర్క్‌ఫ్రం హోం కార్యక్రమం కూడా వేగవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీన్ని నిరంతరం ప్రమోట్ చేస్తూ ఒక ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలన్నారు. రాబోయే మూడు సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు అందుబాటులోకి రాగలవు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలం, వారికి ఎలాంటి నైపుణ్యాలు అవసరమనేదానిపై సమగ్ర కసరత్తు చేయాలన్నారు. అవసరమైతే ఒక కన్సల్టెన్సీ కూడా నియమించుకోవాలని సూచించారు. వర్క్‌ఫ్రం హోం చేయడానికి అందుబాటులో ఉన్న మానవ వనరులకు నైపుణ శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఆర్టీజీ కార్యదర్శి భాస్కర్ కాటంనేని మాట్లాడుతూ డేటా లేక్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 273 రకాల సేవలు అందిస్తున్నామని, జూన్ 12వ తేదీలోపు 370 నుంచి 380 సేవలను అందిస్తామని చెప్పారు. ఆర్టీజీఎస్‌లో అవేర్ హబ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను అధ్యయనం చేసి సేవలు అందజేస్తామని తెలిపారు. పిడుగులు, వర్షాలు, ఉష్ణోగ్రత, ఎండలు తదితర వాతావరణ పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. పిడుగుల గురించి ఒక గంట ముందే పౌరుల మొబైల్ ఫోన్లకు ఐవీఆర్ఎస్ వెళ్లేలా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించుకోబోతున్నట్లు చెప్పారు. పౌరులు ఫోన్ ఎత్తగానే ఏఐ ఆధారిత ఐవీఆర్ఎస్ హెచ్చరిక వారికి వెళుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సీఎం కార్యదర్శులు ముద్దాడ రవిచంద్ర, పీఎస్ ప్రద్యుమ్న, సమాచారశాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, రెవెన్యూ శాఖ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్, డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి తదితరులు పాల్గొన్నారు.