టిబిఆర్ ట్రోఫీ బహుమతుల ప్రధానం సభలో ఎమ్మెల్యే బాలరాజు
బుట్టాయగూడెం.
ప్రజాభిమానం కంటే తనకు పదవులు ముఖ్యం కాదని పోలవరం శాసనసభ్యుడు తెల్లం బాలరాజు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం టివిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టివిఆర్ ట్రోఫీ సీజన్-5 విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ సిహెచ్. పద్మశ్రీ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా టిబిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే బాలరాజు చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. మరో ముఖ్య అతిథి కారుమూరి సునీల్ మాట్లాడుతూ ప్రజాసేవలో ఎమ్మెల్యే బాలరాజు ఆదర్శప్రాయంగా నిలుస్తారని అన్నారు. పోలవరం నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గం శాసనసభ్యునిగా తెల్లం బాలరాజు నియోజక వర్గానికి చేసిన అభివృద్ధి ప్రజలు గుర్తించాలని కోరారు. గత ఐదేళ్లుగా యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడానికి టిబిఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాలని కోరారు. ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తానన్నారు. పదవులు ముఖ్యం కాదని ప్రజలకు అందించిన సేవలు ద్వారా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం ముఖ్యమని అన్నారు. ప్రజాభిమానం కోసమే తాను కష్టపడి పని చేశానని, తాను చేసిన శ్రమను గుర్తించి తనకు మద్దతుగా నిలవాలని కోరారు. విద్యార్థులు, మహిళా ప్రజా ప్రతినిధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. టిబిఆర్ ట్రోఫీ సీజన్ 5 విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఎం సూర్యతేజ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.