•ఏడాది కాలంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రాజెక్టు-5.00 లక్షలు
సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి
అమరావతి, మే 5: ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా ప్రభుత్వ పథకాల అమలు తీరును మెరుగు పర్చేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తున్నదని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సంతృప్తి, ప్రభుత్వ సేవలను ఎంత మెరుగ్గా ప్రజలకు అందించబడుతున్నాయి అనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆర్టీజీఎస్, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు ఏవిధంగా అందుతున్నాయి, వారి సంతృప్తి స్థాయి ఏ విధంగా ఉంది, ఏమైనా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయా, అధికారులు ప్రజలను ఏ విధంగా అయినా ఇబ్బందులకు గురిచేస్తున్నారా అనే పలు అంశాలపై ఐవిఆర్ఎస్, ఇతర మార్గాల ద్వారా కొన్ని వేల మంది లబ్దిదారులను ఇంటర్యూ చేసి నివేదికలను సేకరించడం జరుగుచున్నదన్నారు. గత కొన్ని మాసాలుగా సేకరించిన నివేదికలను పరిశీలిస్తే ప్రజల సంతృప్తి స్థాయి క్రమేణా పెరుగుతూ వస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉదాహణకు ఎన్.టి.ఆర్.భరోసా ఫించను పథకం అమలు తీరును గత మూడు నాలుగు మాసాలుగా పరిశీలిస్తే ప్రతి నెలా ఫించనుదార్ల సంతృప్తి స్థాయి పెరుగుతూ రావడం గమనించండం జరిగిందన్నారు. ఇంటి వద్దనే ఫించను ఇవ్వడం జరిగిందని 87.8% మంది, అధికారుల ప్రవర్తన బాగుందంటూ 85% మంది మరియు చాలా తక్కువ మంది అక్రమ వసూలకు పాల్పడుతున్నారనే విషయాన్ని గుర్తించడం జరిగిందన్నారు. రాజకీయ దృక్కోణంలో కొంత మంది లబ్దిదారుల ప్రవర్తన ఏ విధంగా ఉన్నా సరే, వారిని శాంతపరుస్తూ వారి సంతృప్తి స్థాయిని కూడా మెరుగు పర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రెవిన్యూ సేవలు, హౌసింగ్ పై జరిగిన సమీక్షలో లబ్దిదారులు అన్ని కోణాల్లో సంతృప్తి కరంగా ఉన్నట్లు ఐ.వి.ఆర్.ఎస్. నివేదికలు తెలుపుతున్నాయని మంత్రి తెలిపారు.
ప్రాజెక్టు-5.00 లక్షలు…..
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుచున్నదని, ఆ లక్ష్య సాధనలో భాగంగా ఏడాది కాలంలో ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు-5.00 లక్షల వినూత్నమైన కార్యాచరణను ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని గ్యాడ్యుయేట్స్ అందరికీ ఒక స్కిల్ టెస్టు పెట్టి, వారి స్కిల్స్ ను అంచనా వేసి, అందుకు దగ్గట్టుగా వారికి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మరియు భవిష్యత్తులో పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఇందుకై ఒక మానిటరింగ్ ఏజన్సీని మరియు సర్వే ప్లాట్ ఫార్మను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ర్యాండమ్ గా, శాంపుల్ గా దాదాపు 1,000 మందికి సచివాలయం వద్ద స్కిల్ టెస్టును నిర్వహించగా, ఇంజనీరింగ్ విద్యార్థులు అందరూ ఎటు వంటి శిక్షణా లేకుండా ఉద్యోగాలు పొందేందుకు అర్హత సాదించారన్నారు. అయితే సైన్సు, ఇతర విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ అంజేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రంలోని గ్యాడ్యుయేట్స్ అందరికీ స్కిల్ టెస్టు పెట్టి వారి వృత్తి నైపుణ్యాన్ని గుర్తించడం, అవసరమైన వారిక వృత్తి నైపుణ్య శిక్షణను అందజేసే కార్యాక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇందుకై రియల్ టైమ్ ఎక్సట్రాక్షన్ ఆఫ్ జాబ్ డాటా యూజింగ్ యాప్స్ ను రూపొందించాలని ముఖ్యమంత్రి అదేశించినట్లు తెలిపారు.
రియల్ టైమ్ గవర్నెన్సు ధరఖాస్తులు సకాలంలో పరిష్కారం….
రియల్ టైమ్ గవర్నెన్సు, వాట్పాఫ్ గవర్నెన్సు అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించడం జరిగిందని, జనవరి 30 నుండి ఏప్రిల్ 25 మద్య కాలంలో దాదాపు 73.1 లక్షల ధరఖాస్తులు అందాయని, వాటిలో 36.38 లక్షల ధరఖాస్తులను విజయవంతంగా పరిష్కరించడం జరిగిందని మంత్రి తెలిపారు. వారానికి దాదాపు ఏడు లక్షల ధరఖాస్తులు వస్తున్నాయని, వాటిలో 50 శాతం వరకూ విజయవంతంగా పరిష్కరించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి…..
ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నదని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేసినట్లు మంత్రి తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఆదివారం కురిసిన అకాల వర్షం వల్ల ఏమైనా పంట, ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగినట్లైతే మంగళవారానికల్లా సంబందిత నివేదికను ప్రభుత్వానికి పంపాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. విపత్తుల నిర్వహణ నియమ నిబంధనల మేరకు మానవ, పశు నష్టాలకు సంబంధించి నష్టపరిహారాన్ని వెంటనే అందజేయాలని విపత్తుల నిర్వహణ సంస్థను ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
ప్రకృతి విపత్తులపై నెల రోజుల్లో ఖచ్చితత్వ హెచ్చరికలు…..
ఉరుములు, మెరుపులు, పిడుగులు, వర్షాలు, తుఫాను, భూగర్బ జలాలు, వడగాల్పులు తదితర 30 రకాల ప్రకృతి విప్తతులు, అంశాలకు సంబందించి ప్రజలను హెచ్చరిస్తూ అప్రమత్తం చేసేందుకు అవసరమై సేవలను నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకు రావాలని విప్తతుల నిర్వహణ సంస్థ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. పిడుగులు పడటం వల్ల చాల మంది గొర్రెల కాపరులు మరణిస్తున్న నేపథ్యంలో దగ్గర్లోని సచివాలయ అధికారులు ఆయా ప్రాంతాలకు ముందుగానే చేరుకుని వారిని అప్రమత్తం చేసేందుకై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.