ఏలేశ్వరం:-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం పై మండలంలోని తిరుమాలి గ్రామంలో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (ఐలాజ్)ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. తిరుమాలి గ్రామ ప్రజలు ,రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సభకు ముఖ్యఅతిథిగా ఐలాజ్ కన్వీనర్ బుగత శివ హాజరయ్యారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ హక్కు చట్టం ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వదని, ప్రజల ఆస్తులను వివాదాల్లోకి తీసుకువస్తుందని ,దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు నష్టపోతారని అన్నారు. ఇప్పటివరకు న్యాయస్థానాలకు మాత్రమే ఉండే సివిల్ కేసుల విచారణ ప్రక్రియ రెవెన్యూ అధికారులకు కట్టబెట్టడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, ప్రజల జీవించే హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు .ఈ భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఐలాజ్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ సభ్యురాలు అవసరాల దేవి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 563 సివిల్ కోర్టులు పరిష్కరించలేని సివిల్ కేసులు కేవలం 23 మంది టైటిలింగ్ ఆఫీసర్లు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. భూ హక్కు చట్టం భూ బకాసురులకు ,పెట్టుబడిదారులకు వరంగా మారుతుందని పేర్కొన్నారు .ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో తిరుమాలి గ్రామ ఎంపీటీసీ పసల సూరిబాబు, కోరుకొండ నూకరాజు, సామన రాజేశ్వరరావు, కూరాకుల నాగరాజు, ఇనకొండ అయోధ్య ,నూకల బంతి శేషగిరి ,నూకలబంతి వెంకటేశ్వరరావు ,తోట శివరామకృష్ణ ,కోలా సూరిబాబు ,తోట దొరబాబు తదితరులున్నారు.