తాజా వార్తలుపేద పిల్లలకు విద్యా పథకాల అమలుకు సమన్వయంతో పనిచేయాలి
పేద పిల్లలకు విద్యా పథకాల అమలుకు సమన్వయంతో పనిచేయాలి
- విద్యాలయాల్లో నిజంగా అర్హులైన వారికి ప్రవేశం కల్పించాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి.
- అనంతపురము :సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన కుటుంబాల్లోని పేద పిల్లలకు విద్యా పథకాల అమలులో విద్య, సాంఘిక సంక్షేమ అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి. ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో రెసిడెన్షియల్ పాఠశాలల అడ్మిషన్లు, అదనపు తరగతి గదులు, రైట్ టు ఎడ్యుకేషన్, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సాధారణంగా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల కన్నా వివిధ సంక్షేమ శాఖల గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో చదువుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని, వాటిలో వసతి కూడా అక్కడే ఉండడం అందుకు కారణం అన్నారు. ముఖ్యంగా అనాధలు, నిరుపేదలు, ఇతర అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలను ఈ విద్యాలయాలు ఎంతగానో ఆదుకుంటున్నాయన్నారు. విద్యాలయాల్లో నిజంగా అర్హులైన వారికి ప్రవేశం కల్పించాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రాధాన్యత ఇస్తూనే మిగిలిపోయిన సీట్ల విషయంలో నిజంగా అవసరమైన వారికి సీట్లను కేటాయించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఇందుకోసం జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి నేతృత్వంలో డిఇఓ, సాంఘిక సంక్షేమ శాఖ జెడి, ఇతర సంక్షేమ శాఖ అధికారులందరితో ఒక సమన్వయ కమిటీని జిల్లా కలెక్టర్ రూపొందించారు. ఈ కమిటీ ప్రస్తుతం ఆయా విద్యాలయాల్లో మిగిలిపోయిన సీట్లకు అర్హులను ఎంపిక చేయడంతో పాటు ప్రతినెలా సమావేశమై ప్రగతిని సమక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా వివిధ విద్యాలయాల్లో సీట్లు కోరుతూ అర్జీదారులు జిల్లా కేంద్రం వరకు రావాల్సిన అవసరం లేదని, మండల కేంద్రాల్లోనే అర్జీలను తీసుకొని సమన్వయ కమిటీకి పంపాలని, వాటిపై అర్జీలు వచ్చిన 24 గంటల్లో సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మెరిట్ లిస్ట్, ప్రొసీజర్ ప్రకారం సీట్ల కేటాయింపు చేయాలన్నారు. ఇప్పటికే ఆయా విద్యాలయాల్లో సీట్లు వచ్చిన వారికి 24 గంటల్లోపు ఫోన్ చేయాలని, విద్యాలయాల్లో చేరతారా లేదా అని అడిగి తెలుసుకోవాలని, వారం రోజుల్లోపు సీట్లు పొందిన విద్యార్థులు విద్యాలయాల్లో చేరాలని తెలపాలన్నారు. అన్ని విద్యాసంస్థలతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయా పాఠశాలల్లో మనబడి నాడు – నేడు కింద అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని, సమస్య ఎక్కడ ఉంది అనేది తెలుసుకొని వివరాలను అందించాలన్నారు. విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు త్వరగా అందించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డీఈవో వరలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్, డిటిడబ్ల్యూఓ రామాంజనేయులు, డీవిఈవో వెంకటరమణ నాయక్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రామసుబ్బారెడ్డి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ డిసిఓ మురళీకృష్ణ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కన్వీనర్ సంగీత, ఎస్ఎస్ఏ ఈఈ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.