నిర్మలా సీతారామన్ కు స్వీటు తినిపించిన రాష్ట్రపతి
లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతోంది. జులైలో కొత్తగా కొలువుతీరే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా ఆరోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ ఘనతను సాధించబోతున్న రెండో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలనే కావడం గమనార్హం. మరోవైపు ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో ఈసారి ఎకనామిక్ సర్వే ఉండదు. పాలసీల మార్పులకు సంబంధించిన ప్రకటనలు బడ్జెట్ లో ఉండబోతున్నాయి. ఎన్నికల వరాలు ప్రకటించే అవకాశం ఉంది.
ఇంకోవైపు పార్లమెంటుకు వెళ్లడానికి ముందు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలకు ద్రౌపది ముర్ము తన చేతులతో స్వీటు తినిపించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు భగవత్ కిషన్ రావ్ కరాద్, పంకజ్ చౌదరిలతో పాలు ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ఈ సందర్భంగా అక్కడ ఉన్నారు. బడ్జెట్ పై వీరు కాసేపు చర్చించుకున్నారు. అనంతరం నిర్మల రాష్ట్రపతి భవన్ ను బయల్దేరి పార్లమెంటుకు చేరుకున్నారు.

