పోలీసులకు ఫిర్యాదు చేసిన హెచ్ఎం.
లేపాక్షి: మండల పరిధిలోని తిలక్ నగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆకతాయి పిల్లలు పాఠశాల ప్రాంగణంలోని పలు వస్తువులను ఛిద్రం చేస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వేశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సుందరీకరణలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో పలు మొక్కలను నాటారు. విద్యార్థులు చేతులు, కాళ్లు కడిగేందుకు అక్కడక్కడ కొళాయిలను ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రతకు మారుపేరుగా నిలిచేందుకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పలువురు దాతల సహకారంతో విద్యార్థులకు విద్యాసామగ్రి, పాఠశాలకు అవసరమైన బీరువాలు తదితర వస్తువులను కూడా ఏర్పాటు చేసుకొన్నారు. మధ్యాహ్నం పాఠశాల తరగతులు ప్రారంభం అయిన వెంటనే మధ్యాహ్న సమయాల్లో పాఠశాలలో ఎవరూ లేని సమయంలో కొందరు ఆకతాయి పిల్లలు ప్రహారీ గోడమీద నుండి పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న మొక్కలను పూర్తిగా తొలగిస్తున్నారు. ప్రహరీ గోడలను పగలగొడుతున్నారు. విద్యార్థుల కోసం వేసిన కొళాయిలను బలవంతంగా లాగి పారేశారు. విద్యుత్ వైర్లను కూడా రాళ్లతో నాశనం చేస్తున్నారు. గదులకు వేసిన తాళాలను కూడా పగలగొట్టి పాఠశాల ఆస్తులను ధ్వంసం చేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మండల విద్యాధికారి నాగరాజు దృష్టికి మంగళవారం తీసుకువచ్చారు. ఎంఈఓ సూచనల మేరకు లేపాక్షి పోలీస్ స్టేషన్లో ప్రధానోపాధ్యాయులు ఆకతాయిలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు విశ్వేశ్వరయ్య విలేకరులతో మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రధానంగా పాఠశాల ప్రాంగణంలో పలు మొక్కలను ఇటీవల కాలంలో నాటడం జరిగిందన్నారు. ఆ మొక్కలను ఆకతాయిలు నాశనం చేశారని వారిని పాఠశాల ప్రాంగణంలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
