Friday, May 2, 2025

Creating liberating content

తాజా వార్తలుపరిశ్రమల ఏర్పాటు ఆలోచనతో రండి

పరిశ్రమల ఏర్పాటు ఆలోచనతో రండి

మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది

ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం

175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు

ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం

భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తాం

గత పాలకుల నిర్వాకంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి

మొదటిసారి కేంద్రం కుల గణన చేపడుతోంది

-సీఎం చంద్రబాబు నాయుడు

ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరుపాలెంలో పేదల సేవలో పాల్గొన్న సీఎం

మే డే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి

నారంపేటతో పాటు మరో 10 MSME పార్కులు వర్చువల్ గా ప్రారంభం

త్వరలో దగదర్తి విమానాశ్రయం పనులు చేపడతామని సీఎం వెల్లడి

నెల్లూరు జిల్లా, ఆత్మకూరు: ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత పాలకుల నిర్వాకంతో భవన నిర్మాన కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం తెలిపారు. మే డే సందర్భంగా నెల్లూరు జిల్లా నారంపేటతో పాటు మరో 10 చోట్ల MSME పార్కులు ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంతకుముందు ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం గ్రామం ఎస్టీ కాలనీలో చలంచర్ల సుస్మితకు వితంతు పింఛన్‌ను సీఎం స్వయంగా అందించారు. టీటీసీ చదివిన సుస్మితకు డీఎస్సీలో ఉద్యోగం కొరకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. సుస్మిత ఐదేళ్ల కుమార్తె చైత్రికను గురుకుల పాఠశాలలో చేర్పించి చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పేదల సేవలో కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు.

ఇంటికో ఎంట్రపెన్యూర్‌ని తయారు చేస్తాం

నారంపేటలో ఒక మంచి కార్యక్రకమానికి శ్రీకారం చుట్టాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. ఎవరైనా సరే నేరుగా వచ్చి ఫ్యాక్టరీ పెడితే చాలు. మిగిలిన కరెంటు, షెడ్ల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఇక్కడ మేమే కల్పిస్తాం. ఆనాడు తెలుగువారికి ఒక మహా నగరం ఉండాలి, సంపద రావాలని హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం. ఇపుడు అమరావతిని నిర్మిస్తున్నాం. ఎంఎస్ ఎంఈ పార్కుల ఏర్పాటుకు రైతాంగం సహకారం ఎంతో ముఖ్యం. మొత్తం 40 నియోజకవర్గాల్లో మొదటి దశలో ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నియోజకవర్గానికో MSME పార్కుతో మొత్తం రూ.2,000 కోట్లకు పైగా పెట్టుబడులు కార్యరూపం దాల్చనున్నాయి. 2027–28 ఆర్థిక సంవత్సరానికి 15,000 MSME యూనిట్లు నెలకొల్పేలా చూడటం ద్వారా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము.

రైతులూ పారిశ్రామికవేత్తలు కావొచ్చు

20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దీనివల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాలి. రైతులూ పారిశ్రామికవేత్తలుగా తయారుకావాలి. రైతులు కూడా ఎంఎస్ ఎంఈ పార్కులు పెట్టవచ్చు. అందుకు అవసరమైన అనుమతులు ఇస్తాం. పదెకరాల్లో నానో పార్కు, వందెకరాల్లో ఎంఎస్ఎంఈ , వంద ఎకరాలకు పైగా ఉంటే మేజర్ పార్కులు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఆడబిడ్డలు కూడా ఇండస్ట్రీలు పెట్టి ఆర్థికంగా బలోపేతం కావాలి.

కార్మికులకు ఉపాధి కల్పించి ఆదుకుంటాం

మన దేశంలో 85 శాతం అసంఘటిత కార్మికులే ఉన్నారు. అందులో 65 శాతం వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. కేంద్రం నరేగా ద్వారా పేదలకు 100 రోజులు పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు నేను స్వయంగా చూశాను. మండుటెండలో ఇనుప రాడ్లతో వారు పనిచేస్తారు. వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే. కార్మికుల్లో 56 శాతం మహిళలే ఉన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం జెండాలో కార్మికుల కోసం చక్రం పెట్టారు. ఇలా చేసిన ఏకైన రాజకీయ పార్టీ టీడీపీనే.

గత పాలకుల నిర్లక్ష్యంతో కార్మికులు రోడ్డున పడ్డారు

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు బ్లాక్ లో తరలించారు. ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని వదులుకుని మరీ ఇసుకను ఉచితంగా అందిస్తున్నాము. భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని ఉండాలి. భవనాలు కడితే వారికి ఉపాధి లభిస్తుంది. సంపద పెరుగుతుంది. భవిష్యత్ లో ఆదాయం వస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులు సులభతరం చేశాం. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భవన నిర్మాణాలు చేస్తే సెల్లార్లకు అనుమతిచ్చాం. లే అవుట్ల రహదారుల కోసం 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించాం. కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు గుంటూరు, శ్రీ సిటీలో 100 పడకలు, కర్నూలులో 30 పడకల ఆస్పత్రులు కడుతున్నాము.

పింఛన్ తో పేదల జీవితాల్లో వెలుగులు

మన దేశంలో ఒక్క పెన్షన్ల కిందే ప్రతి నెలా 64 లక్షల మందికి ఏడాదికి రూ. 33 వేల కోట్లు వెచ్చిస్తోంది ఏపీ ప్రభుత్వమే. ప్రతి రెండున్నర కుటుంబాల్లో ఒకరికి పింఛను ఇస్తున్నాం. కొందరి ఆదాయం కంటే పింఛనే ఎక్కువగా ఉంటోంది. గత ప్రభుత్వంలో ముక్కుతూ మూలుగుతూ పింఛన్లు ఇచ్చారు. రూ. 200 పింఛన్లను రూ. 2 వేలు చేసింది నేనే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 3,000 పింఛను రూ 4,000 వేలు చేశాను. డయాలసిస్ రోగులకు రూ. 10 వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు పింఛను ఇస్తూ మానవత్వాన్ని నిరూపించుకున్నాం. జూన్ 1 నాటికి వెరిఫికేషన్ పూర్తి చేసి వితంతు పింఛన్లు అందిస్తాం.

ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతి

అమరావతి నిర్మాణంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అమరావతిలో 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు భూమి ఇచ్చారు. రాజధాని మనకు అవసరం, అందులో మేము భాగస్వాములు అవుతామని రైతులు అన్నారు. మేమిచ్చిన భూమి అభివృద్ధి చేసి అందులో కొంత తిరిగి ఇవ్వాలని రైతులు అన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా అమరావతి నిర్మాణం చేస్తూ ప్రజలను కోటీశ్వరులను చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత తెలుగుదేశానిదే . అమరావతిలో కాలేజీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయి. నేను ఏ ప్రాజెక్టు చేపట్టినా ఏ రైతుకు అన్యాయం జరగనివ్వలేదు. అభివృద్ధి సహించలేని వారి విమర్శలు నేను పట్టించుకోను. పోర్టు, ఎయిర్ పోర్టు , ఇండస్ట్రీ రావడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఉద్యోగాలు వస్తాయి.

ఇన్నోవేషన్ హబ్ గా అమరావతి

త్వరలో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆనాడు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఏఐ ని ప్రోత్సహిస్తున్నాను. భవిష్యత్ ఏఐదే . దాన్ని ఉపయోగించుకుంటే జీవితాలు బాగుపడతాయి. ఉత్తరాంధ్రకు విశాఖ కేంద్రంగా గోదావరి జిల్లాలకు రాజమండ్రి కేంద్రంగా, గుంటూరు, కృష్ణా జిల్లాలకు విజయవాడ కేంద్రంగా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తిరుపతి కేంద్రంగా, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు అనంతపురం కేంద్రంగా రీజనల్ హబ్స్ పెడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారే ఉన్నత స్థితి లో ఉన్నారు. ఉద్యోగం చేయడం కాదు…ఉద్యోగం ఇచ్చే పరిస్థితికి రావాలి.

నెల్లూరు జిల్లా అభివృద్ధి బాధ్యత నాది

నెల్లూరు జిల్లాలో తరతరాలుగా పేదరికంలోనే యానాదులు మగ్గుతున్నారు. వారిని ఆదుకుంటాం. సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం. రామాయపట్నంలో రూ. 95 వేల కోట్ల వ్యయంతో బీపీసీఎల్ రిఫైనరీ వస్తోంది. కావలి పక్కన దగదర్తి ఎయిర్ పోర్టు త్వరలో ప్రారంభిస్తాం. శ్రీ సిటీ ఇక్కడే ఉంది. రూ. 5 వేల కోట్ల వ్యయంతో ఎల్ జీ వస్తోంది. 10 వేల ఉద్యోగాలు కల్పిస్తారు. సీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారుచేస్తాం. శ్రీశైలం నుంచి నీటిని ముందుగా సీమకు ఇచ్చింది ఎన్టీఆరే. సోమశిల , కందలేరుకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆత్మకూరులో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం.

సూపర్ సిక్స్ తో పేదల జీవితాల్లో వెలుగులు

రాష్ట్రంలోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. ఇల్లు, మంచినీటి కుళాయి , మరుగుదొడ్లు, కరెంటు , దీపం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 200కు పైగా అన్నాక్యాంటీన్లు ఏర్పాటుచేశాం. దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మత్స్యకారులకు రూ. 20 వేలు వేశాం. 16,347 టీచరు పోస్టులు భర్తీ చేయబోతున్నాం. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదిలో మూడు విడతల్లో రూ. 20 వేలు పెట్టుబడి సాయం అందిస్తాం. జూన్ నాటికి తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ. 15 వేలు అందిస్తాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 270 సేవలు అందిస్తున్నాం. వాటిని 1000కి పెంచుతాం.

బంగారు కుటుంబానికి ఎంపికైన జ్ఞానమ్మ మాట్లాడుతూ

నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. నా భర్త కూలీ పనులకు వెళ్లి మమ్మల్ని పోషిస్తున్నారు. కూలీకెళ్లని రోజున యాచించి పూట గడుపుకుంటాము. ఉండటానికి ఇల్లు లేదు. ఎవర్నైనా అప్పు అడిగితే మీకు ఏముందని తిరిగి అప్పు ఎలా చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. నా పిల్లల్ని చదివించుకోవాలని నా కోరిక. నేను, నా భర్త చదువుకోలేదు. మాకు ఇల్లు కట్టించండి.

సీఎం: జ్ఞానమ్మ నలుగురు బిడ్డలను ఆస్తిగా భావించాలి. ఆ నలుగురిని చదివిస్తే భవిష్యత్తులో బాగా రానిస్తారు. జ్ఞానమ్మ కుటుంబానికి ప్రభుత్వం తరపున స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇస్తాం. మౌలిక వసతులైన నీరు, విద్యుత్, గ్యాస్, మరుగుదొడ్డి ఏర్పాటు చేస్తాం. నలుగురి పిల్లలకు కలిపి మొత్తం రూ.4 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం.

మార్గదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ

నా చిన్నతనంలో మా నాన్న చనిపోతే మా అమ్మ కూరగాయలు అమ్మి నన్ను చదివించారు. పేదింటి కష్టాలు ఎలా ఉంటాయో నేను ప్రత్యక్షంగా చూశాను. 2020 విజన్ ద్వారా చాలా మంది జీవితాలు మారాయి. మర్రిపాడులో సాహో ఫౌండేషన్ ద్వారా 190 మంది తల్లి, తండ్రి లేని పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తున్నాం. జ్ఞానమ్మ నలుగురు పిల్లలను చదివించే బాధ్యత నేను తీసుకుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article