జిల్లా జేసీ జి.గణేష్ కుమార్
కడప బ్యూరో
పదవ తరగతి పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని.. జిల్లా జేసీ జి.గణేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ సమన్వయ కమిటీ సమావేశాన్ని.. జేసీ జి.గణేష్ కుమార్ సంబందిత శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సమావేశానికి నగర కమీషనర్ ప్రవీణ్ చంద్, డిఆర్వో గంగాధర్ గౌడ్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 27,858 మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఈ పబ్లిక్ పరీక్షలు మార్చి 18 తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లాలోని 153 పరీక్ష కేంద్రాలలో జరగనున్నాయని తెలిపారు.
అదేవిధంగా ఆ పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు, టాయిలెట్స్, త్రాగునీరు, ఫ్యాన్లు, లైట్లు వెంటిలేషన్ అన్నీ సక్రమంగా ఉండేలా ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖ, మెడికల్, విద్యుత్, పోస్టల్ శాఖలు వారికి సబందించిన విధులను బాధ్యతగా నిర్వర్తించి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి రాఘవరెడ్డి, పోలీసు, రెవెన్యూ, మెడికల్, ట్రెజరీ, ఆర్టీసీ, రవాణా, పోస్టల్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.