Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలునూత‌న పారిశ్రామిక విధానాల‌తో యువ‌త‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు

నూత‌న పారిశ్రామిక విధానాల‌తో యువ‌త‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు

కురుక్షేత్ర‌-2023 మేనేజ్‌మెంట్ మీట్‌లో వ‌క్త‌లు

ఉర్రూత‌లూగించిన కురుక్షేత్ర‌-2023

*ప్రజాభూమి,విజ‌య‌వాడ‌ బ్యూరో:- భార‌త‌దేశ ఆర్థిక, పారిశ్రామిక వ్య‌వ‌స్థ‌ల‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయ‌ని అందుకు అనుగుణంగా మేనేజ్‌మెంట్ కోర్సులను అభ్య‌సిస్తున్న విద్యార్థులు వారి నైపుణ్యాల‌ను మ‌రింత‌గా పెంపొందించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ‌స్ట్రి ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు పొట్లూరి భాస్క‌ర‌రావు అన్నారు. కురుక్షేత్ర‌-2023 పేరుతో పీబీ సిద్ధార్థ క‌ళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వ‌ర్యంలో పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో శుక్ర‌వారం విద్యార్థులు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం ఆధ్యాంతం సంద‌డిగా, పోటీత‌త్వంతో జ‌రిగింది. కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసిన అనంత‌రం పొట్లూరి భాస్క‌ర‌రావు మాట్లాడుతూ, ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో జ‌నాభా నిష్ప‌త్తి క్ర‌మేణా త‌గ్గుతున్నప్ప‌టికీ, అభివృద్ధి చెందుతున్న‌టువంటి మ‌న భార‌త‌దేశంలో జ‌నాభా నిష్ప‌త్తి పెరుగుతుంద‌ని అందులో యువ‌జ‌నులు 66 శాతంగా ఉన్నార‌ని ఇది దేశ అభివృద్ధికి సూచిక అని అన్నారు. ఇటువంటి త‌రుణంలో దిగుమ‌తుల‌కు ప్ర‌త్యామ్నాయ అవ‌కాశాలు ఏర్ప‌ర‌చుకోవ‌డం, మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, డిజిట‌లైజేష‌న్‌, పారిశ్రామిక స‌ర‌ళీక‌ర‌ణ విధానాలు వంటి కార‌ణంగా యువ‌త‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని పేర్కొన్నారు. క‌ళాశాల డీన్ ప్రొఫెస‌ర్ రాజేష్ సి జంపాల మాట్లాడుతూ, భార‌త‌దేశం నాలుగు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీలో ఉంద‌ని, ప్ర‌పంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త‌దేశం అవ‌త‌రించింద‌ని చెప్పారు. 2025 నాటికి మొద‌టి మూడు స్థానాల్లో మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉంటుంద‌ని ఆయ‌న గ‌ణాంకాల‌తో వివ‌రించారు. ఒక‌ప్పుడు నైపుణ్య‌త క‌లిగిన మ‌న దేశానికి చెందిన యువ‌త ఇత‌ర దేశాల‌కు త‌ర‌లివెళ్లేవార‌ని ప్ర‌స్తుతం మ‌న దేశంతో పాటు ఇత‌ర దేశాల‌లోని నైపుణ్య‌త క‌లిగిన యువ‌త సైతం భార‌త‌దేశం వైపు అడుగులు వేస్తున్నార‌ని ఆయ‌న వివ‌రించారు. ఇది మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌కే కాకుండా మ‌న దేశంలోనే యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు విసృతం చేయ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని అన్నారు. క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ మేకా రమేష్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎంబీఏ విద్య‌తో పాటు ఇత‌ర నైపుణ్యాల‌ను పెంపొందించుకోవాల‌ని సూచించారు. కురుక్షేత్ర-2023 స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ ఎండీఎస్ రెహ‌మాన్ మాట్లాడుతూ విద్యార్థులు సృజ‌నాత్మ‌క‌త‌ను పెంపొందించుకోవాల‌నే ఉద్దేశంతో గ‌డ‌చిన రెండున్న‌ర ద‌శాబ్ధాలుగా కురుక్షేత్ర పేరుతో విద్యార్థుల‌కు వివిధ విభాగాల‌లో పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కురుక్షేత్ర కార్య‌క్ర‌మానికి రాష్ట్ర వ్యాప్తంగా 40 క‌ళాశాల‌ల నుంచి 600 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజ‌రై త‌మ ప్ర‌తిభ‌ను చాటారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు బిజినెస్ క్విజ్‌, యంగ్ మేనేజ‌ర్‌, స్టాక్ గేమ్‌, హెచ్ఆర్ ఈవెంట్‌, స్టార్ట‌ప్ బిజినెస్ ఐడియా, మార్కెట్ మేక‌ర్స్‌, మిస్ట‌ర్ అండ్ మిస్ కురుక్షేత్ర వంటి విభాగాల‌లో విద్యార్థులు పోటీ ప‌డి త‌మ ప్ర‌తిభాపాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన మిస్ట‌ర్ అండ్ మిస్ కార్య‌క్ర‌మంలో విద్యార్థులు ర్యాంప్ వాక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. కార్య‌క్ర‌మంలో పోటీల్లో గెలుపొందిన విజేత‌ల‌కు క‌ళాశాల యాజ‌మాన్యం, అతిథులు క‌లిసి బ‌హుమ‌తులు, ప్ర‌శంసా ప‌త్రాలు అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో అధ్యాప‌కులు డాక్ట‌ర్ బి.జ‌య‌ప్ర‌కాష్‌, డాక్ట‌ర్ ఎస్‌.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, డాక్ట‌ర్ ఆర్‌.శ్రీనివాసరావు, డాక్ట‌ర్ జె.దుర్గాప్ర‌సాద్‌, ఎ.ఎస్‌.ఎన్‌.ల‌క్ష్మీ, డాక్ట‌ర్ గురుప్ర‌సాద్‌, డాక్ట‌ర్ చైత‌న్యల‌క్ష్మీ, రంజిత్, విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article