- రైతు సేవా కేంద్రాల్లో అధికారుల చేతివాటం
- విచారణలోనూ బెదిరింపులు
ప్రజాభూమి, గుంతకల్లు ప్రతినిధి:
గత ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల (ప్రస్తుత రైతు సేవా కేంద్రాలు) నిర్వహణకు విడుదల చేసిన నిధుల్లో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది.ఈ కేంద్రాల విద్యుత్తు, ఇంటర్నెట్ బిల్లులు, క్లీనింగ్ చార్జీలు, స్టేషనరీ, తాగునీరు వంటి సదుపాయాలకు ప్రతి కేంద్రానికి నెలకు రూ.2047 చొప్పున గత ఐదేళ్లు నిధులు విడుదల చేశారు. వీటితో విద్యుత్తు, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించినా మిగతా సొమ్మును కొందరు అధికారులు నొక్కేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై వ్యవసాయ, ఉద్యాన సహాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు విచారణకు ఆదేశించారు. అనంతపురం జిల్లాలోని 867 ఆర్ బికె (ఆర్ ఎస్ కె) లకు విడుదల చేసిన నిధులు, ఖర్చుల వివరాలను ఓచర్ల రూపంలో సమర్పించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభమైంది.
హడావిడిగా ఓచర్ల సేకరణ:ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, మత్స్యశాఖ సహాయకుల బదిలీలు జరిగాయి. దీనిని ఆసరా చేసుకొని అక్రమార్కులు దొంగ ఓచర్లను సృష్టిస్తున్నారు. సిబ్బంది నుంచి బలవంతంగా వీటిని సేకరిస్తున్నారు. నిధులు ఇచ్చినట్లు, వీటిని ఖర్చు చేసినట్లు ఇవ్వకపోతే రిలీవ్ చేయబోమని, కొత్త స్థానంలో చేర్చుకోబోమని భయపెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కేవలం విద్యుత్తు, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించి మిగతా నిర్వహణ ఖర్చులు 50 శాతం ఆర్ బికె (ఆర్ఎస్ కె) లకు ఇవ్వలేదని సిబ్బంది చెబుతున్నారు. స్టేషనరీ, హార్డ్ వేర్ పరికరాల మరమ్మత్తులు, క్లీనింగ్, వాటర్ చార్జీలు సిబ్బంది చాలాచోట్ల భరించారు. ఈ నిధుల గోల్ మాల్ పై ఇతర శాఖల అధికారులతో విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయని పలువురు పేర్కొంటున్నారు.
రూ.5 కోట్ల వరకు పక్కదారి..?:జిల్లాలో 2020 -21 నుంచి 2024-25 వరకు 867 ఆర్ బి కే (ఆర్ ఎస్ కె) లకు ఒక్కోదానికి రూ.2047 చొప్పున మొత్తం రూ. 10.7 కోట్ల దాకా విడుదల చేశారు. ప్రతినెలా వీటిని సిబ్బందికి ఇవ్వాల్సి ఉంది. అలా చేయకుండా కొందరు అధికారులు వారి వద్దే పెట్టుకొని కొంతకాలం దాటాక నొక్కేశారు. దీనిలో రూ. 5 కోట్ల వరకు అక్రమాలు జరిగాయనే వాదన వినిపిస్తోంది. కొందరు వైసీపీ నాయకుల సహకారంతో దీనికి తెగబడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో పరిశీలన:ఆర్ బికెలకు (ఆర్ ఎస్ కె) ఇచ్చిన నిర్వహణ ఖర్చులకు సంబంధించి లెక్కలపై విచారణ జరుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశంతో పరిశీలనకు అధికారులను నియమించాం. ఎక్కడైనా లోపాలను గుర్తిస్తే చర్యలకు సిఫారసు చేస్తాం. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
ఉమామహేశ్వరమ్మ,అగ్రికల్చరల్ జెడిఏ, అనంతపురం
