రాజేంద్రనగర్ లోని వ్యవసాయ యూనివర్సిటీలో 100 ఎకరాలను రాష్ట్ర హైకోర్టుకు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. హైకోర్టు నిర్మాణం జరిగితే అక్కడ జీవవైవిద్యం దెబ్బతింటుందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని..వ్యవసాయ ఉద్యాన యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని ..ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.ఈ ఆందోళనలో నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నం చేశారు పోలీసులు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై తమ ప్రతాపాన్ని చూపారు. అయితే ఏబీవీపీ కి చెందిన ఓ మహిళా కార్యకర్తను ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు స్కూటీ మీద వెంబడించారు. అంతేకాదు ఆమె జుట్టు పట్టి లాగారు. దీంతో ఆ మహిళా కార్యకర్త కింద పడింది. దీనికి సంబంధించిన వీడియో ను కొంతమంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా..అది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘాతుకానికి పాల్పడిన మహిళా కానిస్టేబుళ్ళ ను సస్పెండ్ చేయాలని..మహిళా పోలీసు తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే జుట్టు పట్టి లాగడమేంటని ప్రశ్నించారు.