కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ హెచ్చరిక
కడప బ్యూరో
కడప పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మునిసిపల్, పంచాయతీ అధికారుల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం తో పాటు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఫ్లెక్సీ ల ఏర్పాటు కు సంబంధిత అధికారుల నుండి అనుమతి పొందిన చోట మాత్రమే వాటిని నెలకొల్పాలని తెలిపారు. విద్వేషాలు రగిల్చేలా ఫ్లెక్సీలు ఉండకూడదని అయన తెలిపారు. మోటార్ సైకిల్, ఆటో, కార్ ర్యాలీ లకు అనుమతి లేదని.. ముందస్తు అనుమతి తో సాధారణ నడక ర్యాలీ లకు మాత్రమే నిబంధనల మేరకు అనుమతించడం జరుగుతుందన్నారు. నిర్వాహకులు పోలీసు అధికారుల నుండి అనుమతి పొందిన తేదీ, సమయము మరియు రూట్ లోనే వెళ్లాలని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని తెలిపారు. ర్యాలీలలో ఇతరులకు హాని కలిగించే ఎలాంటి వస్తువులు తీసుకెళ్లడం చట్ట రీత్యా నేరమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాల్లో కూడా డి.జె లకు అనుమతి లేదని కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ పేర్కొన్నారు. పోలీస్ అధికారుల నుండి అనుమతి పొంది లౌడ్ స్పీకర్లు వినియోగించు వారు ఇతరులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించకూడదని, సుప్రీం కోర్టు మార్గ దర్శకాల మేరకు నడచు కోవాలని తెలిపారు. నిర్ణీత ప్రమాణాల డెసిబుల్ లోపు మాత్రమే ధ్వని వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులపైనే ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ హెచ్చరించారు. స్కూళ్లు, హాస్పిటల్ లు, ప్రార్ధనా స్థలాల వద్ద ( సైలెన్స్ జోన్స్) ఎట్టి పరిస్థితిలో మైక్ లేదా లౌడ్ స్పీకర్ ను వినియోగించకూడదని తెలిపారు. రాత్రి 10 గం.నుండి ఉదయం 6 గం. మధ్య ఎలాంటి వాయిద్య పరికరాలు, స్పీకర్ లు, మైక్ లు వాడకూడదని సుప్రీం కోర్టు మార్గ దర్శకాల్లో ఆదేశించడం జరిగిందని డి.ఎస్.పి ఈ సందర్బంగా గుర్తు చేశారు. పై సూచనలను కడప పోలీసు ఉపమండల పరిధిలో ప్రతి ఒక్కరు పాటిస్తూ ప్రజల శాంతి భద్రతలను సమర్ధంగా నిర్వహించుటలో సహకరించాలని కోరారు.