నీ మోమున మెరిసే నవ్వు..
నీ అందమైన భాష..
నీ గుండె ఘోష..
మనసారా నువ్వు నవ్వే నవ్వు
ఆరోగ్యానికి దివ్యౌషధం..
ఎంత నియంత ఏలుబడిలోనైనా ఆ నవ్వుపై
ఉండదు నిషేధం..
అందుకే హాయిగా చేసేయి
నవ్వుల అశ్వమేధం..!
పిల్లలు నవ్వితే నిష్కల్మషం..
సినిమాల్లో..జీవితాల్లో
విలన్లు నవ్వితే అందులో విషం
రాజకీయ నేతల నవ్వులో
వారి వాగ్దానాల్లాగే కల్మషం..
సీమ నేతల నవ్వులో
అర్థం లేని పౌరుషం..
అమ్మ నవ్వులో అమృతం..
నాన్న నవ్వులో నమ్మకం..
ఆత్మీయుల నవ్వులో మమకారం..
అసూయపరుల నవ్వులో సురాకారం..
హేళనగా నవ్వితే వెటకారం
స్నేహితుల నవ్వులో ఉపకారం
ఏ పనైనా నవ్వుతో నుడికారం
అప్పుడే నీ కలల సాకారం
మొత్తంగా నవ్వులు విరిసే ఇల్లే
అందమైన ప్రాకారం..!
అన్నట్టు..నవ్వు మంచిదైనా
కొండొకచో అదే నవ్వు
నాలుగు విధాల చేటు..
పాంచాలి నవ్వు కురుక్షేత్రం..
ఇప్పుడు కొందరి నగవు
ఇళ్లలో తగవు…
ప్రస్తుత రోజుల్లో
అలాంటివి మనకి
తగనే తగవు…!!
నేడు నవ్వుల దినోత్సవం…
హాయిగా నవ్వుకోండి..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286