*సొమ్ము భక్తులది…సోకు అధికారులది…
*దేవుడంటేభయం లేదు…భక్తులంటే భలే చులకన…
*ఆలయాల్లో కూడా రాజకీయాలే…
*అంతా నిర్లక్ష్యం… ఆపై అన్ని కుంటి సాకులు…
*తప్పులు చేస్తే ప్రకృతి ప్రకోపించదా..
*వీరి పాపాలకు పోయేది ఎవరి ప్రాణాలో కదా…
*అందుకే గా సనాతనం సన్నగిల్లుతోంది…
*హిందూత్వంమంటే బలహీన మవుతుంటే…
*అవినీతి కోసం అర్రులు చాచుతూ…
*అప్పనంగా దోచుకోవడానికి అలయాలే వేదికలు అవుతుంటే…
*నాడు వెంకన్న…నేడు అప్పన్న సన్నిధిలో..
*అధికారుల నిర్లక్ష్యంగా ఇంకెంతమంది అశువులు బాపాలో…
*అహో బ్రహ్మ ఏమిటీ ఖర్మ…
(రామమోహన్ రెడ్డి)
సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్న అవినీతి,అడ్డగోలు తనం ,అంతులేని నిర్లక్ష్యం కారణంగా ఆధ్యాత్మికతతో అలరించాల్సిన ఆలయాల్లో అపశృతిలు చోటుచేసుకుని అమాయక భక్తుల ప్రాణాలు అర్దాంతరంగా ఆవిరై పోతున్నాయి.
సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన వారే తమ సంచులు నింపుకోవడానికి స్వామి అమ్మవార్లను కూడా వదలని వైచిత్రి ఈ రాష్ట్రంలో ఉండటం హిందువులు చేసుకున్న దౌర్భాగ్యమని చెప్పాలి.పవిత్ర మైన ఆలయాలను కూడా రాజకీయ వేడికలుగా చేసుకుని తమ స్వార్థం కుటిల బుద్ధితో ఆచారాలను కూడా ప్రక్కన పెట్టి అపవిత్రమైన భావాలతో ఉంటూ అనేక మంది భక్తుల జీవితాలతో ఆడుకుంటున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులను ఆ భగవంతుడు కూడా ఏమి చేయలేని పరిస్థితి కి వచ్చారని చెప్పాలి.
నాడు కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల భక్తులు అసువులు బాసారు.నేడు సింహాచలం అప్పన్న సన్నిధిలో కేవలం అధికారుల నిర్లక్ష్యంగా ఏడుగురు భక్తుల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. అభివృద్ధి పేరుతో ఆర్భాటం ఈ ఆర్భాటం వెనుక అడ్డగోలు గా దోచుకుని దాచుకుందామన్న అనాలోచిత నిర్ణయం తో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన అప్పన్న చందనోత్సవం అపవిత్రం చేశారు. ఏడాది ఒకసారి జరిగే ఈ మహా కార్యక్రమం కూడా సక్రమంగా చేయలేకపోవడం అత్యంత బాధాకరం. ప్రకృతి వైపరీత్యం అనేది మనము చేసే పాప పుణ్యాలను బట్టి ఉంటుందనే లోకొత్తర ధర్మం తెలియదా అంటే తెలుసు. అయిన అంతులేని నిర్లక్ష్యం.. పోయేది ఎవరి ప్రాణలో కదా అన్న అలసత్వం లాంటిదే ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.ఓ వైపు వాతావరణ మార్పు ,ఆ శాఖ సూచన ప్రకారం అక్కడక్కడ అకాల వర్సాలు పడుతున్నా కూడా అంత తొందరగా ఆ నిర్మాణం చేపట్టకపోతే అప్పన్న అలిగి అక్కడి నుండి వెళ్లిపోతారని ఎవరైనా చెప్పారా ఏమిటీ ఈ అవినీతి అధికారులు.
ఏ సొమ్ము తో జీతాల రూపంలో లక్షలు తీసుకుంటూ కూడా అది చాలదని అవినీతి సొమ్ముకు కూడా ఆశపడి ఆ సొమ్ము చెల్లించే భక్తులకే రక్షణ లేకుండా చేస్తున్న తీరు చూస్తే ఈ అధికారులను ఏమి చేసినా పాపం కాదేమో అన్న భావన భక్తుల హృదయాల నుండి వెల్లడి అవుతుంది.సంఘటన జరిగిన తరువాత ఏ విచారణ చేసిన అది తాత్కాలికమే తప్ప అవినీతి, అలసత్వం బాధ్యత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి కఠిన శిక్షలు వేసే చట్టాలు రానంత వరకు ఎక్కడైన ఏదయినా జరిగే ప్రమాదం లేక పోలేదన్న భావన వ్యక్తంచేస్తున్నారు భక్త జనం.