ఈ మేరకు ముంబయిలో జరిగిన వేవ్స్ సమ్మిట్ -2025 లో ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఎంవోయూ
భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్ మెంట్ సిటీ ఏపీకి రావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్
క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఆవిష్కరణలతో పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్న టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతి: భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్-2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా తమ సహకారాన్ని ప్రకటించినట్లు మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు తొలి సారి ఇండియాలో ప్రత్యేకించి ముంబయిలో జరుగుతున్న ప్రతిష్టాత్మక వేవ్స్ (ది వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్) సమ్మిట్ -2025 లో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఎంవోయూ జరిగిందని తెలిపారు.ఈ ఎంవోయూ ద్వారా ఏపీకి వచ్చే సందర్శకులు లీనమయ్యేలా థీమ్ పార్క్ లు, గేమింగ్ జోన్‌లు, గ్లోబల్ సినిమా కో-ప్రొడక్షన్ జోన్‌లు ఏర్పాటు కానున్నాయని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. అంతేకాక ఉద్యోగ సృష్టి, నైపుణ్య అభివృద్ధి, పర్యాటకం మరియు డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ ఎంవోయూ దోహదం చేస్తుందని మంత్రి దుర్గేష్ వివరించారు.
ప్రస్తుతం మంత్రి కందుల దుర్గేష్ వియత్నాంలో ఉండటంతో పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి కాట, క్రియేటివ్‌ల్యాండ్ స్టూడియోస్ వ్యవస్థాపకురాలు మరియు క్రియేటర్స్ ఇంక్ లండన్ చైర్మన్ సాజన్ రాజ్ కురుప్, హాలీవుడ్ నుండి గ్లోబల్ అడ్వైజరీ బోర్డు ప్రతినిధులు డేవిడ్ ఉంగర్, సీఈవో ఆర్టిస్ట్స్ ఇంటర్నేషనల్, గ్లోబల్‌గేట్ మేనేజింగ్ డైరెక్టర్ విలియం ఫైఫర్, నికోలస్ గ్రానాటినో చైర్మన్ నోవాక్వార్క్ లు ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఇటీవలే క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ప్రతినిధులు కొందరు వెలగపూడి సెక్రటేరియట్ లోని మంత్రి పేషీలో ఈ విషయంపై చర్చించారు. మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. వేవ్స్ రౌండ్‌టేబుల్ ను సందర్శించిన పలువురు ప్రముఖులు మరియు హాలీవుడ్ నుండి గ్లోబల్ అడ్వైజరీ నుండి కొంతమంది ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే రూ. 300 కోట్ల కేంద్ర నిధులను రాబట్టారు..పర్యాటక రంగంలో రూ. 1200 కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టి 8 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. తద్వారా వేలాది సంఖ్యలో యువతకు ఉపాధి దక్కనుంది. తాజా ఒప్పందంతో మరింత మంది యువతకు ఉపాధి కలిగే అవకాశం ఉంది
వియత్నాం పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ ఈ అంశంపై మాట్లాడుతూ క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో భాగస్వామ్యం అనేది రాష్ట్రాన్ని చలనచిత్ర, వినోద పర్యాటకం అభివృద్ధికి తాము చేసిన ప్రయత్నాలలో ఒక ఉత్తేజకరమైన మైలురాయిని సూచిస్తుందన్నారు.. ఈ అవగాహన ఒప్పందం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కంటే మించినదని పేర్కొన్నారు. ప్రతిభ, ఆవిష్కరణ, పర్యాటక అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు ఇది దోహదపడనుందన్నారు. క్రియేటర్‌ల్యాండ్ ఏర్పాటు చేసే ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ హబ్ ద్వారా వినోద ఆర్థిక వ్యవస్థ పెరగడమే గాక, థీమ్ పార్కులు, ప్రేక్షకులు లీనమయ్యేలా జోన్‌లు, ప్రపంచ ఉత్పత్తి కేంద్రాల ద్వారా సందర్శకుల అనుభవాలను కూడా మారుస్తుందన్నారు. ఈ సాంస్కృతిక, ఆర్థిక పరివర్తనకు నాయకత్వం వహిస్తుందన్నందుకు గర్వపడుతున్నామన్నారు. ఈ సహకారం వైవిధ్యమైన, అధిక-నాణ్యత ఉత్పత్తికి తమ నిబద్ధతకు మద్దతు ఇస్తుందన్నారు. అత్యాధునిక సాంకేతికత మరియు అసాధారణమైన కంటెంట్‌తో నడిచే ఏవీజీసీ, వీఎఫ్ఎక్స్ సహా మీడియా మరియు వినోద రంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు.. డిజిటల్ వినోదంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడం, పరిశ్రమ మరియు వినియోగదారులతో మరింత అర్థవంతమైన మార్గాల్లో కనెక్ట్ అవ్వడం లక్ష్యంగా ఈ ఎంవోయూ కుదుర్చుకున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
వివరాలు పరిశీలిస్తే క్రియేటర్‌ల్యాండ్ 5-6 ఏళ్లల్లో రూ. 8000 – 10,000 కోట్ల మధ్య పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేయబడింది. ఇది ఏఐ ఆధారిత రియల్ టైమ్ రెండరింగ్ మరియు వాల్యూమెట్రిక్ క్యాప్చర్ టెక్నాలజీలు, ఇమ్మర్సివ్ థీమ్ పార్కులు, గేమింగ్ జోన్‌లు, ఎస్పోర్ట్స్ అరీనాలు మరియు గ్లోబల్ సినిమా కో-ప్రొడక్షన్ జోన్‌లు, వీఎఫ్ఎక్స్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, గేమింగ్ మరియు ఇమ్మర్సివ్ స్టోరీ టెల్లింగ్‌లో యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటర్ ల్యాండ్ అకాడమీ ద్వారా ఆధారితమైన వర్చువల్ స్టూడియో కాంప్లెక్స్‌ను రూపొందించడానికి ఉపయోగపడుతుంది.
అంతేగాక ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి సృజనాత్మక మరియు సాంకేతిక డొమైన్‌లలో నైపుణ్యం, ఉపాధి అవకాశాలకు మార్గం కానుంది. అంతేగాక ఏఐ, ఆర్ అండ్ డీ, వీఎఫ్ఎక్స్, గేమింగ్ , వినోదం, టెక్, పర్యాటక రంగాలలో 1,50,000కు పైగా కొత్త ఉద్యోగాలను కల్పించేందుకు అవకాశం ఉంది. భారతదేశాన్ని తమ నిర్మాణ కేంద్రంగా మార్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా 20కి పైగా స్టూడియోలు నిర్మించేందుకు క్రియేటివ్ ల్యాండ్ చర్చలు జరుపుతోంది.
పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఆవిష్కరణలతో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహిస్తున్నామన్నారు. తద్వారా రాష్ట్ర భవిష్యత్ కు పాటుపడుతున్నామన్నారు. వినోద మౌలిక సదుపాయాలు, ప్రతిభ నైపుణ్యాలు, పర్యాటకం కలిసి జీవనోపాధిని సృష్టించడానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడానికి , ప్రపంచ సృజనాత్మక పటంలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫైల్‌ను పెంచడానికి ఇది ఒక సమగ్ర దృక్పథాన్ని అందిస్తుందని తెలిపారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు సమ్మిళిత వృద్ధిని ఎలా నడిపిస్తాయో చెప్పడానికి ఇది ఒక బ్లూప్రింట్‌గా తాము భావిస్తున్నామని ఆమె వివరించారు.
క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా వ్యవస్థాపకుడు , ఛైర్మన్ సాజన్ రాజ్ కురుప్ మాట్లాడుతూ క్రియేటర్‌ల్యాండ్ అనేది ఒక గమ్యస్థానం మాత్రమే కాదు, ఇది ఒక సృజనాత్మక ఉద్యమంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ యొక్క దార్శనిక నాయకత్వంతో చేతులు కలపడం ద్వారా తాము వినోదం, విద్య మరియు ఆవిష్కరణల భవిష్యత్తును నిర్మిస్తున్నామన్నారు. సందర్శకులు లీనమయ్యే అనుభవాల నుండి ఏఐ నేతృత్వంలోని కథ చెప్పడం వరకు, క్రియేటర్‌ల్యాండ్ సాంకేతికతను సంస్కృతితో, ప్రపంచ ప్రతిభను భారతీయ ఊహతో మిళితం చేస్తుందన్నారు. భారతదేశాన్ని వినోద మౌలిక సదుపాయాలు మరియు ఐపీ సృష్టి యొక్క ప్రపంచ పటంలో ఉంచే దిశగా ఇది మా సమిష్టి అడుగు అన్నారు. ప్రపంచ కంటెంట్ పవర్‌హౌస్‌గా మారే దిశగా భారతదేశం ప్రయాణంలో ఈ సహకారం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. సాంకేతికత, సృజనాత్మకత , మౌలిక సదుపాయాలను సమగ్రపరచడం ద్వారా వినోద మౌలిక సదుపాయాలలో ప్రపంచ నాయకుడి స్థానంలో భారతదేశాన్ని నిలిపేందుకు ఇది ఒక అడుగు అన్నారు. భారతదేశాన్ని డిజిటల్ సృజనాత్మకత, ఉపాధి మరియు సాంస్కృతిక దౌత్యానికి కేంద్రంగా మార్చాలనే తమ ఆలోచనకు ఆంధ్రప్రదేశ్ నాయకత్వం దోహదపడటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.