-మోడీకి సభలో బుక్ చూపిస్తూ రాహుల్..!
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై తొలి పార్లమెంట్ సమావేశాల నిర్వహణ రోజే విపక్షాలు రచ్చ మొదలుపెట్టేశాయి. మోడీ సర్కార్ వైఫల్యాలపై పార్లమెంట్ తొలిరోజే ఆందోళనకు దిగాయి. పార్లమెంట్ కు ఐక్యంగా రావడం ద్వారా ఇండియా కూటమి ఎంపీలు తమ ఐక్యతను చాటుకునే ప్రయత్నం చేశారు. అంతే కాదు రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ రాజ్యాంగ కాపీలతో నిరసనలకు దిగారు. విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రధాని మోడీకి రాజ్యాంగం కాపీని చూపిస్తూ ఆయన బాధ్యత గుర్తుచేశారు. 18వ లోక్‌సభ తొలి సెషన్లో మొదటి రోజే “రాజ్యాంగాన్ని రక్షించండి” అంటూ నినాదాలు చేస్తూ విపక్షాలు పార్లమెంట్ కు కవాతు నిర్వహించాయి. పార్లమెంట్ బ్లాక్ లో సమావేశమై ఈసారి సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై సమీక్షించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ, డీఎంకేకు చెందిన టీఆర్ బాలు సహా ప్రతిపక్ష నేతలు ఒకప్పుడు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో గాంధీ విగ్రహం ఉన్న ప్రదేశంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా బల నిరూపణకు ఎంపీలతో కలిసి వచ్చారు. చేతుల్లో రాజ్యాంగ ప్రతులను పట్టుకుని, ‘రాజ్యాంగం చిరకాలం ఉండాలి’, ‘మేం రాజ్యాంగాన్ని రక్షిస్తాం’, ‘మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం’ అంటూ నినాదాలు చేశారు. ఎంపీలకు నిరసన వేదికగా ఉన్న గాంధీ విగ్రహాన్ని ఇటీవలే 14 ఇతర విగ్రహాలతో పాటు కాంప్లెక్స్‌లో ఉన్న ప్రేర్ణ స్థల్ అనే కొత్త ప్రదేశానికి మార్చారు. ఈ నేపథ్యంలో ఎంపీలు భేటీ అయి రాజ్యాంగాన్ని రక్షించాలని నినాదాలు చేశారు. మరోవైపు ప్రధాని మోడీ ఎంపీగా లోక్ సభలో ప్రమాణస్వీకారం చేసేందుకు వెళ్తున్న సమయంలో విపక్ష బెంచీల్లో ఉన్న ఎంపీ రాహుల్ గాందీ ఆయనకు రాజ్యాంగాన్ని చూపించడం ఎంపీలను ఆకర్షించింది. రాజ్యాంగాన్ని గుర్తు పెట్టుకోవాలని మోడీని కోరుతున్నట్లుగా రాహుల్ గాందీ ఎలాంటి నినాదాలు లేకుండానే రాజ్యాంగ ప్రతిని ఆయనకు చూపించారు. ప్రధాని మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ప్రమాణం చేసి వెళ్లిపోయారు.

