పులివెందుల టౌన్
రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ , జనసేన పార్టీలు ,బిజెపికి బానిస పార్టీలని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ,పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వేలూరు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ బిజెపి అంటే బి అంటే బాబు ,జె అంటే జగన్, పి అంటే పవన్ లా ఆంధ్ర రాష్ట్ర బిజెపి మారిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో బిజెపికి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేరని అలాంటి పరిస్థితులలో ప్రజలే బిజెపిని శూన్యంగా చూస్తుంటే ఈ మూడు పార్టీలు బిజెపికి బానిసల మారి వారి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. బిజెపి నాయకులు రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మీరు కీలుబొమ్మలుగా మారి చూస్తున్నారే తప్ప బిజెపిని ఒక మాట కూడా అనడం లేదన్నారు. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీకి బిజెపి మంగళం పాడిన .స్టీల్ ప్లాంట్ కు స్వస్తి పలికిన ఈ ముగ్గురు ఒక్క మాట కూడా బిజెపిని అనడం లేదన్నారు.దుగ్గరాజపట్నం ఓడరేవు మాటే ఎత్తలేదు , పోలవరం మూసే లేదని విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు రాలేదన్నారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని చూస్తోందన్నారు. ఇలా రాష్ట్రానికి బిజెపి తీరని అన్యాయం చేస్తున్న ఆ మూడు పార్టీలు బిజెపి అడుగులకు మడుగులెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలైన ఆ మూడు పార్టీలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి గాని, తెచ్చే శక్తి గాని లేదని ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ఆ దిశగా ప్రతి ఒక్కరు ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లింగాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేలూరు మనోహర్ రెడ్డి, తొండూరు మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిలు పాల్గొన్నారు.