- తిరుపతి బస్టాండ్ ఎదుటే 24/7 ప్రముఖ బార్‌లో విచ్చలవిడిగా మద్యం విందు
- మద్యం మత్తులో యువత కత్తులు తిప్పుతున్న దుస్థితి
ప్రజాభూమిప్రతినిధి(తురక అమరనాథ్) – తిరుపతి

తిరుపతి… దేవతల నగరం పుణ్యక్షేత్రం… ఇక్కడ భక్తి సువాసన పరచుకోవాలి కానీ ఇప్పుడు మద్యం వాసన దుర్వాసనగా మారుతోంది భక్తి నగరం పాపాల పుట్టగా మారిపోతుందన్న వాస్తవం ప్రజల్లో ఆందోళన రేపుతోంది.
బస్టాండ్ ఎదుటే బార్…
తిరుపతి బస్టాండ్ గుండె ప్రాంతంలో ఉన్న ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్ (24/7) లో మద్యం విక్రయాలు 24 గంటలూ సాగుతున్నాయి.
సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకూ కాకుండా, ప్రతిరోజూ ఉదయం నుంచే మద్యంతో గ్లాసులు మోగుతున్నాయి.
ఎవరూ ప్రశ్నించని స్వేచ్ఛ, ఎటువంటి ఆంక్షలు లేని వాతావరణం తిరుపతిలో మద్యం విందుకు కొత్త ఊపిరినిచ్చింది.
తాగిన యువకుల అల్లర్లు … ప్రజలకు భయం
బార్ చుట్టుపక్కల ప్రతి సాయంత్రం యువకులు గుంపులుగా చేరి తాగుతున్నారు. తాగి రోడ్డుపై గొడవలు, దుర్వచనాలు, కత్తులు తిప్పడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. మేము సాయంత్రం తర్వాత బయటకి రావడానికి కూడా భయపడిపోతున్నాం అని పక్కదుకాణాల యజమానులు వాపోతున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. భక్తులతో నిండిపోవాల్సిన నగరం ఇప్పుడు మద్యం మత్తుతో ముంచెత్తబడుతోంది.

ఈస్ట్ పోలీస్ స్టేషన్ కళ్లముందే…?
అతి విచిత్రమేమిటంటే ఆ బార్‌కు అతి దగ్గరలోనే ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఉంది
అయినా పోలీసులు తెలిసి తెలియనట్టు, నిమ్మకు నీరు ఎత్తినట్టు.ప్రవర్తిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇంత బహిరంగంగా జరిగే అక్రమాలకు పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం, భక్తుల ఆవేదన
తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులే ఇప్పుడు నిర్లక్ష్య వైఖరిచూపుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
భక్తుల ఆశ్రయం అయిన తిరుపతిలో ఇలా అక్రమ బార్ కార్యకలాపాలు సాగడం ఆందోళన కలిగిస్తోంది. ఇది దేవాలయ నగరమా లేక మద్యం మయం నగరమా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
తిరుపతి పవిత్రతను కాపాడండి : ప్రజల విజ్ఞప్తి
ప్రజలు ఒక్కసారిగా మేల్కొంటున్నారు.
పవిత్ర నగర ప్రతిష్టను నిలబెట్టడానికి బార్లపై చర్యలు తీసుకోవాలని, అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.. తిరుపతి పవిత్రతను కాపాడండి… దేవాలయ నగర గౌరవాన్ని కాపాడండి అని ప్రజల కేకలు మార్మోగుతున్నాయి.

