సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయలం మొదటి బ్లాక్ లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి వర్గం చర్చించింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ కు ఆమోదం తెలిపింది. టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదముద్ర వేసింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ ప్రాసెస్ లో భాగంగా తొలుత టెట్ నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. డీఎస్సీలో టెట్ మార్కుల వెయిటేజీ ఉండడంతో తొలుత టెట్ నిర్వహించి, ఫలితాలు వెల్లడించాక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో పాటు వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్ల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు ఎస్ఈఆర్టీతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్‌ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం తెలిపింది. ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలని నిర్ణయించింది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్జేయూకేటీలో రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది.
న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేచర్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి ఇవ్వాలని నిర్ణయించింది. డిజిటల్ ఇన్‌ఫ్రా కంపెనీని రద్దుకు అంగీకరించింది. సీఎం జగన్ కుటుంబ సభ్యుల భద్రతకు స్పెషల్ సెక్యూరిటీ కింద 25 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పాఠశాల విద్యాశాఖలో పలు ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది.

