చంద్రగిరి:తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో డయేరియా ప్రబలకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితిసింగ్ బుధవారం రఘనాధరెడ్డి కాలనీ, ఎస్టీవి నగర్, రైతుబజార్ ప్రక్కనున్న వాటర్ ట్యాంక్, సీతమ్మ నగర్ ఏరియా, రిజర్వాయిర్ కాలనీ, చిన్నబజార్ వీధి, గాంధీ రోడ్డు ప్రాంతాల్లో ప్రాంతాల్లో నీటి కుళాయిలు, వాటర్ ట్యాంక్లను, సంపులను, వాటర్ సప్లై లైన్లను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. డయేరియా ప్రభలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ తెలియజేస్తూ, ముఖ్యంగా వాటర్ సోర్స్ లో వెంటనే నీటి కాలుష్య పరీక్షలు నిర్వహించాలని, నిర్ధారణమైనచో నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే వివిధ డ్రైన్ల గుండా వెళ్లే తాగునీటి పైపులైన్లను క్షున్నంగా పరిశీలించాలని, లీకేజిలు వుంటె పూర్తిస్థాయిలో లీకేజీలను అరికట్టాలని, అదేవిధంగా వాటర్ ట్యాంకులను పూర్తిగా తనిఖీ చేసి శుభ్రంగా ఉండేటట్లు చూడాలని, క్లోరినేషన్ చేయడం తప్పనిసరిగా వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగరపాలక సంస్థ ద్వారా సరఫరా చేసే నీటి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి నాణ్యతపై ప్రతిరోజు తనిఖిలు నిర్వహించాలని, ముఖ్యంగా ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే నియంత్రించేలా కృషి చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితిసింగ్ తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈలు సంజీవ్ కుమార్, మహేష్, తేజశ్వి వున్నారు.

