స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నేను ఒప్పుకోలేదు
అందుకే ప్రైవేటీకరణ ఆగింది
గాజువాకలో టిడిపి అభ్యర్థికి ఓటు వేస్తే ప్లాంట్ అమ్మకానికి ఆమోదం తెలిపినట్టే
అమర్నాథ్ను గెలిపిస్తే ప్రైవేటీకరణ నిలువరించేందుకు చర్యలు
గాజువాక సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడి
గాజువాక :
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాను ఒప్పుకోలేదు కాబట్టే ఇప్పటివరకు ఆగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గాజువాకలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ప్లాంటును అమ్మేయడానికి ఆమోదం తెలిపినట్టే అవుతుందని, ఆ తర్వాత తాను ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడలేనని జగన్మోహన్ రెడ్డి అన్నారు. అదే అమర్నాథ్కు ఓటేసి గెలిపిస్తే ప్లాంట్ ప్రైవేటీకరణకు తామంతా వ్యతిరేకమని ప్రజల నుంచి ఒక మెసేజ్ కేంద్రానికి వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి వివరించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరపాటున గాజువాక ప్రజలు ఎన్డీఏకి ఓటేస్తే, దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ విక్రయానికి రెఫరెండంగా తీసుకుంటుందని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అమర్నాధుని గెలిపిస్తే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందని ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైల్వే జోన్ భవనాల కోసం భూములు ఇచ్చామని, కావాలనే వాళ్ళు తీసుకోవడం లేదని, కూటమి నాయకులు రాష్ట్ర ప్రజలపై కపట ప్రేమ చూపిస్తారని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి అమర్నాథ్ను, విశాఖ పార్లమెంటు అభ్యర్థి బొత్స ఝాన్సీ ని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అంతకుముందు మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి పేదల కష్టాలు తెలుసుకుని నవరత్నాలను ప్రవేశపెట్టి 99 శాతం అమలు చేశారని చెప్పారు.
తమ కుటుంబాలలో మంచి జరిగితేనే తనకు ఓటు వేయమని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి ప్రకటన ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ చేయలేదని అమర్నాథ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ అంశాలపై ప్రధాని మోదీ ఎటువంటి వివరణ ఇవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారని అమర్నాథ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయన సారధ్యంలో ప్లాంట్ ప్రైవేటు కాకుండా పోరాటం సాగిస్తామని అమర్నాథ్ స్పష్టం చేశారు. తన తండ్రి తాత ఈ ప్రాంతానికి చేసిన సేవలను గుర్తించుకుని తనను ఎన్నికలలో దీవించాలని కోరారు. గంగవరం నిర్వాసితుల సమస్యలను కార్మికుల సమస్యలను, అలాగే స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని అమర్నాథ్ హామీ ఇచ్చారు.గాజువాకలో జన సునామిఇసుక వేస్తే రాలనంత జనం.. కనుచూపుమేరా ఎటు చూసినా జన ప్రవాహం.. కిక్కిరిసిన జనసమూహంతో దిక్కులన్నీ ఒకటయ్యాయి. గాజువాకలో సోమవారం జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో కనిపించిన దృశ్యాలు.. చీకటి చిరునవ్వులు, చెక్కుచెదరని ఉత్సాహం, జగన్మోహన్ రెడ్డి కనిపించగానే ఫ్యాను గుర్తు చూపుతూ కదం తొక్కిన మహిళలు, ఆయన ప్రసంగానికి కేరింతలు కొట్టిన యువతరంతో ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగింది.
గాజువాక 60 ఫీట్ రోడ్లో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి బహిరంగ సభ కు వేలాదిగా జనం తరలివచ్చారు. మరోపక్క పంతులు గారి మేడ వరకు జనం రోడ్లపై బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈ సభకు అశేష జనవాహిని తరలి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈ సభను చూస్తుంటే అమర్నాథ్ విజయం ఖాయం అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పార్టీ వివిధ విభాగాల నాయకులు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

