- అనంతరం సిబ్బందికి శుభాకాంక్షలు
అనంతపురము
75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం స్థానిక అనంతపురం రేంజ్
డీ.ఐ.జీ. కార్యాలయంలో డీ.ఐ.జీ. ఆర్.ఎన్.అమ్మిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. రేంజ్ పరిధిలోని ప్రజలకు, పోలీసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతపురం రేంజ్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగుర వేసి ఆనందోత్సవాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈసందర్భంగా డీ.ఐ.జీ. మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, మన దేశానికి సొంత రాజ్యాంగం లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టిందన్నారు. అప్పుడు జనవరి 26, 1950న భారత రాజ్యాంగం దేశం మొత్తం అమలులోకి వచ్చిందన్నారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగమని, స్ఫూర్తిదాయకమని అన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి మన రాజ్యాంగ మూల స్థంభాలని డీ.ఐ.జీ.
అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ప్రజా పరిపాలన వ్యవస్థ కలిగిన గణతంత్ర దేశంగా విరాజిల్లుతోందన్నారు. భారత రాజ్యాంగం రూపకర్తలు, దేశం కోసం త్యాగాలు చేసిన జాతీయ నాయకుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. అదనపు ఎస్పీ హనుమంతు, ఏ.ఆర్. డీఎస్పీ మునిరాజా, డీ.ఐ.జీ. కార్యాలయం మేనేజర్ మాధవి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.