వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్
లేపాక్షి :-త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు జటాయువు పక్షికి మోక్షం ప్రసాదించిన జటాయువు ఘాటు అభివృద్ధికి తాను కృషి చేస్తానని వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన జటాయు ఘాటును పరిశీలించారు. జటాయువు ఘాట్లో టీటీడీ ఆర్థిక సహకారంతో గుప్త కామేశ్వరి ఆలయం, సీతారాముల ఆలయం, జటాయువుఘాట్ తో పాటు కోనేరును కూడా నిర్మించేందుకు పనులు ప్రారంభమయ్యాయి. అయితే సంబంధిత గుత్తేదారు అకాల మరణం తో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వాటిని ఆలయ చైర్మన్ రమానందన్ పూర్తిగా పరిశీలించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ, ప్రాచీన చరిత్ర కలిగిన జటాయుఘాట్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు కృషి చేస్తానన్నారు. స్థానిక అధికారులతో చర్చించిన మీదట విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లతానని ఆయన తెలిపారు. మంత్రి సహకారంతో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తో జటాయు ఘాట్ నిర్మాణం పై చర్చిస్తానన్నారు. టీటీడీ సహకారంతోనే జటాయు ఘాట్ నిర్మాణ పనులను పూర్తి చేస్తానన్నారు. జటాయుఘాట్ ను కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని చైర్మన్ రమానందన్ పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే పర్యాటకులు జటాయు ఘాట్ తిలకించేందుకు సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతానని పేర్కొన్నారు.ఆయన వెంట పి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.