రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో
ప్రజావసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పరిష్కారం చూపడమే గడప గడపకు మన ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 240 వ వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. నందమూరినగర్లోని 9వ లైన్ లో విస్తృతంగా పర్యటించి 121 గడపలను సందర్శించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు విన్నవించిన పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపుతూ ముందుకు సాగారు. అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్ల కాలంలో నిత్యం ప్రజల మధ్యన ఉన్న ఏకైక ప్రభుత్వం దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. గత తెలుగుదేశం ఐదేళ్ల అసమర్థ పాలన కారణంగా తమపై పనిభారం పెరిగిందని ఎమ్మెల్యే అన్నారు. అయినప్పటికీ ప్రజావసరాలను తీర్చడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి న్యూ రాజరాజేశ్వరి పేట మధ్య కాలనీలన్నింటినీ ఈ ప్రభుత్వంలోనే 90 శాతం వరకు అభివృద్ధి పరిచినట్లు వెల్లడించారు. డిసెంబర్ చివరి నాటికల్లా మిగిలిన పనులన్నింటినీ పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, మానం వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, అంజిరెడ్డి, తోపుల వరలక్ష్మి, శోభన్, మహేశ్వరి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి
రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తూ రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గూర్చి మాట్లాడే ముందు తెలుగుదేశం నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాబు హయాంలో నిండా అవినీతిలో కూరుకున్న అచ్చెన్నాయుడు సహా అప్పటి మంత్రులకు.. సీఎం జగన్మోహన్ రెడ్డి గూర్చి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. 2019 ఎన్నికలలో రాష్ట్ర ప్రజలందరూ కర్రుకాల్చి వాత పెట్టినా టీడీపీ నేతలకు బుద్ది రాలేదని విమర్శించారు. మరోవైపు యువగళం ఒక ఫెయిల్యూర్ ప్రోగ్రాం అని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై బురద చల్లేందుకు చేపట్టిన యాత్ర తప్ప.. ప్రజావసరాలను గుర్తించే కార్యక్రమం ఏమాత్రం కాదని చెప్పారు. బాబు అరెస్టైన వెంటనే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి నారా లోకేష్ అని విమర్శించారు. మరలా ఏ ముఖం పెట్టుకుని యువగళం పాదయాత్ర చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజాసంకల్ప యాత్ర ప్రతిఒక్కరి మనస్సును కదిలించిందని అందుకు ఫలితమే 151 సీట్లతో తిరుగులేని పార్టీగా వైఎస్సార్ సీపీ అవతరించిందని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. కనుక ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా సీఎం జగన్ సిద్ధాంతాలు, ఆశయాల ముందు నిలబడలేరని ధీమా వ్యక్తం చేశారు.