సైకిల్ ఎక్కిన మరి కొందరు వైసీపీ నేతలు

చంద్రగిరి :చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, యంగ్ లీడర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గురువారం తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాయునాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు భారీ అనుచర వర్గం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతి రూరల్ మండలం, పెరుమాళ్లపల్లెకు చెందిన డాలర్స్ దివాకర్ రెడ్డి గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు. ఆ తర్వాత పార్టీలకు దూరంగా ఉంటూ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో అధిక ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేతగా ఎదిగారు. ఇందులో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో చంద్రబాబునాయడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా డాలర్స్ దివాకర్ రెడ్డి చేరికతో చంద్రగిరి నియోజక వర్గం లో టీడీపీ మరింత బలపడుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆయనతో పాటు చంద్రగిరి నియోజకవర్గం కు చెందిన వైసీపీ నేతలు చిన్ని, దుర్వాసుల రెడ్డి, మాజీ ఎంపీపీ సోదరుడు ఢీల్లి, బాల శంకర్, చంద్ర, గాదెంకి గురుమూర్తి, ప్రవీణ్ రెడ్డి, మధు, రంజిత రెడ్డి, వెంకటేష్ రెడ్డి, మధుసుధన్ రెడ్డి తదితరులు పార్టీలో చేరారు. వీరందరికీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. పులివర్తి నాని ని భారీ మెజారిటీతో గెలుపుకు కృషి చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు.