అనంతపురము బ్యూరో:స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల జిల్లా స్థాయి జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవము సందర్భంగా కవియిత్రి మొల్లమాంబ చిత్రపటానికి డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ఐసిడిఎస్ పిడి బియన్.శ్రీదేవి, తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, 16వ శతాబ్దపు తెలుగు కవియిత్రిగా ఆతుకూరి మొల్ల ఎంతో ప్రసిద్ధిగాంచారన్నారు. తెలుగులో రామాయణాన్ని రాసారని, అది మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెం దిందని అన్నారు. మొల్ల స్వస్థలం కడప జిల్లా, గోపవరం మండలం, గోపవరం గ్రామమని, ఆమె కుమ్మరి కుటుంబంలో జన్మించిందని తెలిపారు. మొల్ల శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రశస్తి పొందిందని, మొల్ల శైలి చాలా సరళమైంది, రమణీయమైనదని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో మొల్లమాంబ జీవిత చరిత్రను వివరించారు. ఆమె కవిత్వం గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు రాష్ట్ర అధికార ప్రతినిధి, కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, కుమ్మర శాలివాహన ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఓబుళపతి, కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు రామాంజనేయులు, శ్రీనివాసులు, జలాలపురం పోతులయ్య, సతీష్ కుమార్, లక్ష్మి నారాయణ, ఓబులేసు, సిండికేట్ నగర్ రామాంజనేయులు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారత అధికారులు రవీంద్రనాథ్ ఠాగూర్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

