భద్రత లో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు.
అనంత రేంజ్ డీఐజీ షేముషి.

సత్యసాయి జిల్లాఎస్పీ మాధవరెడ్డి.
హిందూపురం టౌన్ /లేపాక్షి : హిందూపురం నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుచేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను అనంతపురం డి ఐ జి షేముషి, శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి శనివారం పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరచిన కౌంటింగ్ కేంద్రాలకు మూడంచెల భద్రతను వారు పరిశీలించారు. హిందూపురం సమీపంలోని బిట్ ఇంజనీరింగ్ కళాశాలలో హిందూపురం, మడకశిర, పెనుగొండ, కదిరి, అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ను వారు పరిశీలించారు. కౌంటింగ్ సందర్భంగా నిర్వహించాల్సిన భద్రతపై వారు సంబంధిత అధికారులకు పలు సూచనలు ,సలహాలను అందజేశారు. అనంతరం విజిటర్స్ రిజిస్టర్లో అనంతపురం డిఐజి షేముషి సంతకం చేశారు. అనంతరం లేపాక్షి మండల పరిధిలోని నాయన పల్లి సమీపంలోని డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాన్ని వారు పరిశీలించారు. కౌంటింగ్ సందర్భంగా ఏర్పాటుచేసిన భద్రతపై అనంతపురం రేంజ్ డీఐజీ షేముషి సంబంధిత అధికారులతో ఆరా తీశారు. ఓట్ల లెక్కింపు గదులను ఆమూలాగ్రంగా పరిశీలించి మరిన్ని సౌకర్యాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో పటిష్టంగా భద్రతా ఏర్పాట్ల కౌంటింగ్ కేంద్రంలోనూ కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా రెండు కౌంటింగ్ కేంద్రాల్లోనూ బయట నుండి వచ్చే వాహనాల పార్కింగ్ తదితర విషయాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ రెండు కౌంటింగ్ కేంద్రాల్లో లోపలికి వెళ్లే మార్గాన్ని, బయటకు వెళ్లే మార్గాన్ని తప్ప మరో మార్గం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎన్నికల అధికారుల నుండి అనుమతి ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి తనిఖీ చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు కౌంటింగ్ కేంద్రాల్లో మరింత పటిష్టమైన బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. అనుమతించిన గేటు ద్వారానే అధికారులను ,ఎన్నికల ఏజెంట్లను, అభ్యర్థులను పంపాలన్నారు. మరో మార్గం గుండా ఎవరిని అనుమతించకూడదని పోలీసు అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల అధికారులు అనుమతించిన వాహనాలను ఆయా ప్రదేశాల్లోనే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరూ గుంపులుగా వెళ్లరాదన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని ఆమూలాగ్రంగా తనిఖీ చేసి గుర్తింపు కార్డులను పరిశీలించిన అనంతరం కౌంటింగ్ కేంద్రంలోకి పంపాలని సూచించారు. అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ కు వచ్చేవారు సెల్ఫోన్లను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకురాకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేంతవరకు కేంద్రాల వద్ద మూడంచెల పోలీసు వ్యవస్థను కొనసాగించాలన్నారు. ఎన్నికల తతంగం పూర్తయ్యేంతవరకు నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు డిఐజి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ విష్ణు, డిఎస్పీలు శ్రీనివాసరావు, కన్జక్షన్, ఏ ఆర్ డి ఎస్ పి విజయ్ కుమార్, హిందూపురం రూరల్ సీఐ ఈరన్న, లేపాక్షి ఎస్ఐ గోపి తదితరులు ఉన్నారు.