అమరావతి: గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి జగన్ పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శ్రీను బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్ లో పెట్టి, ఈరోజు తీర్పును వెలువరించింది. మరోవైపు శ్రీనుకు హైకోర్టు పలు షరతులు విధించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. రూ. 25 వేల పూచీకత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని చెప్పింది. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్ లో హాజరుకావాలని ఆదేశించింది. ర్యాలీల్లో పాల్గొనకూడదని షరతు విధించింది. హైకోర్టు తీర్పుపై దళిత, పౌరహక్కు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ కేసులో రెండో సాక్షిగా ఉన్న జగన్ మాత్రం.. తాను కోర్టుకు రాలేనని చెపుతూ, అడ్వొకేట్ కమిషనర్ ను నియమించి, తన తరపున ఆయన సాక్షం చెప్పేలా పిటిషన్ వేశారు. దీంతో, జగన్ తరపున అడ్వొకేట్ కమిషనర్ కోర్టుకు హాజరవుతున్నారు. ఇంకోవైపు, కుట్ర కోణంపై మరింత లోతైన విచారణ జరపాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్ఐఏ కోర్టు 2023 జులై 25న పిటిషన్ ను డిస్మిస్ చేసింది.విమానాశ్రయంలో దాడి జరగడంతో కేసు ఎన్ఐఏ పరిధిలోకి వెళ్లింది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కేసును విచారించింది. 2019 మేలో శ్రీనివాస్ కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో ఎన్ఐఏ అధికారులు పిటిషన్ వేశారు. ఈ క్రమంలో ఆయన బెయిల్ రద్దయింది. ఇప్పుడు, ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.