-చంద్రబాబు మాటల్లో ఓటమి భయం కనిపిస్తోంది
-బాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధం
-మక్బూల్ ను ఆశీర్వదించండి
-కార్యకర్తల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి
కదిరి :జెండాలన్నీ జతకట్టి కూటమిగా ఏర్పడినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని, చంద్రబాబు మాటలు చూస్తుంటే అతనికి ఓటమి భయం పట్టుకున్నట్లు తెలుస్తోందని, వచ్చే ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి, ఉమ్మడి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం యన్.పి కుంట మండలంలోని పెడబల్లి, గాండ్లపెంట, కదిరిలోని అత్తార్ లాడ్జి, దత్త ఫంక్షన్ హాల్, తనకల్లు మండలంలోని పొలం సిద్ధారెడ్డి ఫంక్షన్ హాల్ లలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాల్లో పెద్దిరెడ్డి పాల్గొని మాట్లాడారు. చంద్రబాబుకు గతంలో అధికారం కట్టబెడితే రాష్ట్ర ప్రజల కనీస అవసరాలు తీర్చకుండా పార్టీ కార్యకర్తలకు, సొంత మనుషులకు దోచిపెట్టారని విమర్శించారు. చంద్రబాబుకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. “మీకు మంచి జరిగింటేనే నన్ను ఆశీర్వదించండని అడుగుతున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్నే ప్రచారకర్తలుగా ఎన్నుకున్నారు. గడచిన ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కింది. రైతులతో పాటు మహిళా సంఘాల రుణమాఫీలు, ఇంటికో ఉద్యోగం అంటూ ఇచ్చిన హామీలన్నీ గోడమీద రాతలకే పరిమితం చేసిన చంద్రబాబుకి, మ్యానిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అనుకొని ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డికి తేడా గమనించి రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. అనుభవజ్ఞుడని అధికారం ఇస్తే ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పది సంవత్సరాలు అవకాశమన్న రాజధానిని వదులేసి తాత్కాలిక రాజధాని పేరుతో ప్రజాధనాన్ని వృధా చేసి ఐదు సంవత్సరాల కాలం గడిపేసిన ఘనుడు చంద్రబాబు. సిద్ధం సభలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లు మహిళలకు కేజీ బంగారం, రైతులకు బెంజ్ కారు, యువకులకు మోటర్ బైక్ లతో సహా అన్నీ ఇస్తాననే తప్పుడు హామీలను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోకండి. చంద్రబాబు సొంత వర్గాల కోసం ఏర్పాటు చేసి ప్రజలను పట్టిపీడించిన జన్మభూమి కమిటీలకు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేర్చడానికి పరిపాలనను ప్రజల చేరువు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ మధ్య వ్యత్యాసం గమనించండి. పేదరికం కొలబద్దగా తీసుకొని కులం, మతం, ప్రాంతంతో పాటు రాజకీయాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలందిస్తున్న సంక్షేమ పాలనను గతంలో ఎప్పుడైనా చూసామా? ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూ మరోవైపు విద్య, వైద్య రంగాలలో నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఇంగ్లీష్ విద్యను అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. అదేవిధంగా వైద్యరంగంలో ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడంతో పాటు మెడికల్ కాలేజీలను నిర్మించి నిరుపేదలకు అండగా నిలవడం జరిగింది. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించే సీఎం జగన్మోహన్ రెడ్డికి రెండోసారి అధికారం ఇస్తే ఇంతకంటే మెరుగైన పాలనందిస్తారు. గతంలో అబద్ధపు హామీలతో మోసం చేసే అధికారం చేపట్టిన కూటమి సభ్యులకి అవకాశం ఇస్తే రాష్ట్రం అందకారమవుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ ను, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ ను చల్లని దీవెనలతో ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని కోరుతున్నాను” అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ పూల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, వైఎస్ఆర్సిపి బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల హరిప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల వెంకటరమణ, మాజీ సమన్వయకర్త ఎస్.ఎమ్.డి ఇస్మాయిల్, లీగల్ సెల్ జోనల్ ఇంచార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు సాదత్ అలీ ఖాన్, హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.