(దేశంలో తొలి ఎన్నికల
నగారా మ్రోగి
డెబ్బై నాలుగు
వసంతాలు
పూర్తయిన సందర్భంగా
ఓ అవలోకనం..)
(అక్టోబర్ 25..1951)
నా దేశం అమృతాంతరంగ..
నా దేశం ఉత్తుంగతరంగ..
ఓటుకు నోటు కోరక..
ప్రలోభాలకు లొంగక..
ఉచితాలకై ఎదురుచూడక..
అసలు అలాంటి ధ్యాసే లేక
ఓటును పవిత్ర వస్తువుగా
ఎన్నికలను మహాక్రతువుగా..
రాజ్యాంగాన్ని
భగవద్గీతగా ఎంచి
నేను సైతం ఓ గొప్ప
ప్రజాస్వామ్యయజ్ఞంలో సమిధను అనుకొని
ఓటు వేసిన
సగటు మనిషి..
దేశ భవితకు
తానే విధాతగా..!
ఇదెక్కడి విడ్డూరమని ముక్కున వేలేయకు..
జరిగే పనేనా అని
నోరు వెళ్ళబెట్టకు
ఇది డెబ్బై రెండేళ్ల
మునుపటి మాట..
దశాబ్దాల బానిసత్వ సంకెళ్లు తెచ్చుకుని భారతావని
సర్వ స్వతంత్ర దేశమైన
తొలినాళ్ళ ముచ్చట..
మొదటి ఎన్నికలు..
అవి కూడా జమిలీ..
దేశమంతా ఒకే ఫ్యామిలీ..
ఒక పండగ..
అక్షరం ముక్క రానోడు
కూడా లక్షణంగా
ఓటు హక్కు వినియోగించుకున్న
సత్యకాలం..!
సరిగ్గా..డెబ్బై నాలుగు
సంవత్సరాలకు మునుపు..
1951..
అక్టోబర్ 25న..
దేశంలో మోగింది
తొలి ఎన్నికల నగారా..
ప్రజాస్వామ్యానికి పహారా..
లోక సభలో 489..
27 రాష్ట్రాలలో
3280 స్థానాలు..
పదికోట్ల అరవై లక్షల
మంది ఓటర్లు..
ఇరవై వేల మంది అభ్యర్థులు..
ఒక తీర్పు..
ఒక చారిత్రక ఘట్టం..
124 రోజుల మహాయాగం..
ఇదే రోజున..
1952..ఫిబ్రవరి 21న
ముగిసింది..
ప్రపంచం మొత్తం
ఇటే చూసింది..
అప్పుడే పుట్టిన పాప..
ఎలా బంగురుతుందా అని..
బోల్తా పడితే సంబరపడదామని కొందరు..
దెబ్బలు తింటే పరిహసిద్దామని ఇంకొందరు..
ఓ గెలుపు..ఓ మలుపు..
గెలుపు దేశానిది..
ఉత్సాహం ప్రజాస్వామ్యానిది
రేసులో ఘనవిజయం
కాంగిరేసుదే అయినా
సంబరం ప్రతి భారతీయుడిది
తన దేశం గెలిచిందని..
తను నమ్మిన ప్రజాస్వామ్యం
పరువు నిలిచిందని..
తన జాతి మహోన్నతమై
జగతికే దారి చూపిందని..
భారతదేశం సర్వ సత్తాకమై
భారత పతాకం
సగర్వంగా వినువీధుల్లో
ఎగిరిందని..
మేరా భారత్ మహానని..!
అలాంటి దేశం..
అటువంటి ఎన్నికలు..
ఇప్పుడెలా జరుగుతున్నాయి
జనం చేవచచ్చి..
పార్టీలు పుచ్చి..
ఓటు విలువ పతనమై..
అంగడిలో సరుకై…
బుద్ధులు ఇరుకై..
నేరస్థులు ఏలికలై..
పాలికలే దొంగలై..
ప్రజాస్వామ్యం పరిహాసమై..
జాతి సిగ్గుపడేలా..
మొత్తం వ్యవస్థే ఢీలాపడేలా!
₹###₹###₹###₹###₹
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286

