ఇది కాదా మార్పుకు
ఒక యత్నం..
ఎవరో వస్తారని..
ఏదో చేస్తారని ఎదురుచూసి
మోసపోయావు ఇన్నాళ్లు..
ఇప్పుడు మీ మధ్య నుంచే
ఒక చెల్లి..
పోరాటాల సిరిమల్లి
బరిలోకి దిగింది చూడు..
ఇన్నాళ్లు ఓ లెక్క..
ఇప్పుడో లెక్క..
ఇప్పుడైనా
తేల్చెయ్యరాదా
బడాబాబుల లెక్క..!
ఎన్నాళ్ళు భయ్..
ఇలా ఎవరో కక్కిన
కూటి కోసం..
విసిరేస్తున్న
ఎంగిలాకుల కోసం
ఇలా అర్రులు చాస్తావు..
ఎన్నికలొస్తే చాలు..
పొద్దుగాల అదే పని..
ఎవడేమి పడేస్తడని..
అయిదేళ్ల పొద్దు
నిను గాచే
ఓటును
బిర్యానీ పొట్లానికి..
మందు సీసాకి
అమ్మేసుకుంటవే..
ఇదేనా రాజ్యాంగం
నీకిచ్చిన హక్కు..
ఇందుకేనా
నీకో ఆధార్ కార్డు..
ఓటరు కార్డు..
పోలింగుకి బయలెల్లే ముందు దాకా..
అభ్యర్థి పారేసే
పది కోసమో..వందకోసమో..
ఎదురుచూడ్డమేగా పని..
ఛీ.. ఎదవ బ్రతుకు..
ఎంగిలి మెతుకు..!
ఇప్పటికైనా కన్ను తెరు..
ఇటు స్వచ్చమ్మైన కొండవాగు..
అటు కాటేసే కాలనాగు..
నిన్ను మింగేసే నేతను
ఎన్నాళ్ళు భరిస్తావు..
అతగాడి కాడె భరిస్తూ..
నీ పాడి నువ్వే మోసుకుంటున్నట్టు..!
ఒక్కసారి చూడు..
నిజాయితీగా
ఓటెయ్యడంలోని మజా..
నీలాంటి ఓ సగటు మనిషిని
గెలిపించుకోడంలోని కిక్కు..
ఇదిగో నీలాంటి మనిషే..
భేషజాలు లేని నాయిక..
ఇప్పుడు శిరీష…
రేపు మరో ప్రత్యూష..
మర్నాడు ఇంకో ఉష..
నీ గుండె ఘోష..
నీ అభిలాష..
నీ భాష..!
జనం కోసం..
జనం మధ్య నుంచి..
జనంతో నడుస్తూ..
జనం భాషే మాటాడుతూ..
కదిలి వస్తోంది కడలిలా..
వాగ్దానాల హోరుతో కాదు..
నిజాయితీ తరంగాలతో..!
ఒక్కతి ఏం సాధిస్తుందని
అనుకోకు..
నిలదీసే ధైర్యముంటే..
ప్రశ్నించే గొంతు ఉంటే..
తానే పూరించదా
విప్లవశంఖం..
నువ్వు కోరుకునే మార్పుకు..
ఎదురుచూస్తున్న తొలిపొద్దుకు
తాను ప్రతిరూపమై నిలిస్తే..
అయిదేళ్ల నాటికి
మరిన్ని గొంతులు
జత కలవకపోవునా..
ఒక్కరు ఆరంభించినా రణమే..
అది దుర్మార్గానికి వ్రణమే..
ఆశాకిరణమే..!
మొదలైంది నడక..
దీన్ని ఇక్కడే ఆపేయనీయకు..
మొదటి అడుగే
కావాలి పిడుగు..
ఈ గెలుపు శ్రీకారమై..
నీ ఘీంకారమై…
రేపటి ఉషస్సుకు..
సగటు మనిషి యశస్సుకు
నీ సభ వేదికై..
నీ ఓటు సార్ధకమై..
వచ్చే అయిదేళ్లకు
సభ సామాన్యుల కొలువై..
నీ జాతి పరువై..!
సురేష్..9948546286