8 మెగా ఈవెంట్స్, 11 నేషనల్ ఫెయిర్స్, 10 ఇంటర్నేషనల్ ఫెయిర్స్
గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 500కి పైగా హోమ్‌స్టేలు
త్వరలో 150 అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు
ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్‌కు ప్రమోషన్
20 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యం కావాలి
పర్యాటకరంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
‘ఫెస్టివల్ క్యాలెండర్’ రూపకల్పనకు ఆదేశం
అమరావతి, మే 5 : రాష్ట్రంలో పర్యాటకరంగం మరింత అభివృద్ధి చెందేలా, అందరినీ ఆకట్టుకునేలా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని…ఇందుకోసం ‘టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్’ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రదేశాల్లోనూ ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను బట్టి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పర్యాటకరంగంపై సోమవారం సచివాలయంలో టూరిజం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. పర్యాటకరంగం అభివృద్ధికి రాష్ట్రంలో ఎంతో ఆస్కారం ఉందని… తప్పనిసరిగా 20 శాతం వృద్ధి సాధించాలని అధికారులకు నిర్దేశించారు. కన్సెల్టెన్సీల ఏర్పాటు ద్వారా పర్యాటకానికి అనుకూలంగా ఉన్న ప్రాజెక్టులు వీలైనన్ని ఎక్కువ రూపొందిస్తే… వాటిని చేపట్టేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. సింగపూర్ తరహాలోనే రాష్ట్రంలోనూ నైట్ సఫారీ గురించి అధ్యయనం చేయాలన్నారు.
అందమైన తీర ప్రాంతాలు గుర్తించండి :
రాష్ట్రంలో అందమైన సముద్ర తీర ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వాకల్చర్‌లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా ఉన్నా… దానిని ప్రతిబింబించే ప్రాజెక్టులు ఎక్కడా లేవని… డాల్ఫిన్ షోలు ఏర్పాటు చేయాలన్నారు. గండికోటకు ‘యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్’ గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని చెప్పారు. ‘ప్రసాద్’ పథకం కింద సింహాచలం, అన్నవరంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. రాష్ట్రమంతా 150 అరకు కాఫీ స్టాల్స్… ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల తరహాలో ఏర్పాటు చేయాలని సూచించారు. భవానీ ఐల్యాండ్, హోప్ ఐల్యాండ్ సహా రాష్ట్రంలోని ఐల్యాండ్‌లు అన్నింటినీ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు :
కొండపల్లి, కూచిపూడి, కడియం, మంగళగిరి, చీరాల, బాపట్ల, అరకు తదితర ప్రాంతాల్లో మొత్తం 14 చోట్ల ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు వివరించగా… వాటిని 50 చోట్ల ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సెంటర్లలో నేచురల్ ఫార్మింగ్‌తో పాటు, మిగిలిన రంగాలను చేర్చాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని 20 ప్రధాన దేవాలయాల్లో టెంపుల్ టూరిజాన్ని… అలాగే విశాఖ, అమరావతిలో హెల్త్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో అతిధులకు ఆర్గానిక్ ఫుడ్ రుచులు అందించేలా, నేచురల్ ఫార్మింగ్ గురించి తెలిసేలా చేయాలన్నారు. అమరావతిని క్రియేటివ్ సిటీ హబ్‌గా చేయాలని… భవిష్యత్‌లో క్వాంటం కంప్యూటింగ్ తర్వాత క్రియేటివ్ ఎకానమీకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.
టెంట్ సిటీస్… సీ-రివర్ క్రూయిజ్‌లు :
రాష్ట్రంలో అరకు, గండికోట సహా 6 ప్రాంతాల్లో 180 టెంట్స్‌తో టెంట్ సిటీస్ ఏర్పాటు చేస్తున్నామని… ఇంకా సీ క్రూయిజ్, రివర్ క్రూయిజ్ సర్వీసులు ప్రవేశ పెడుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాజమండ్రి, విజయవాడ బెర్మ్ పార్క్, సూర్యలంకలో హౌస్ బోట్స్ త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. రూ.76 కోట్లతో రాష్ట్రంలో పర్యాటకరంగానికి చెందిన 15 హోటళ్లు, రిసార్టులను అప్‌గ్రేడ్ చేయగా, మరో 15 హోటళ్లు, రిసార్టులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. అలాగే… పర్యాటకరంగాన్ని ఆకట్టుకునేందుకు 8 మెగా ఈవెంట్స్, 11 నేషనల్ ఫెయిర్స్, 10 ఇంటర్నేషనల్ ఫెయిర్స్ నిర్వహిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కొత్తగా రోప్‌వేలు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న 10 ప్రాంతాలను గుర్తించామని అధికారులు చెప్పారు. రూ.12,565 కోట్ల పెట్టుబడితో 8,073 రూముల సామర్ధ్యం కలిగిన హోటళ్లు, రిసార్టులకు సంబంధించి మొత్తం 69 ప్రాజెక్టులు నెలకొల్పేందుకు వివిధ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.
త్వరలోనే ప్రత్యేకంగా హోమ్‌స్టే పాలసీ :
స్థానికులకు జీవనోపాధి, సంస్కృతి పరిరక్షణ, సుస్థిర పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన, వారసత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 500కు పైగా హోమ్‌స్టేలు గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. వంతమూరు, మగడ, కూరిడి, తజంగి వంటి అరకు గిరిజన ప్రాంతాల్లోనూ హోమ్‌స్టేలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కొనసీమ వారసత్వ ప్రాంతాల్లోనూ, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య పర్యాటక నగరాల్లోనూ హోమ్‌స్టేలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అంతేకాక, తిరుపతిలో ఇప్పటికే ఉన్న 600కు పైగా హోమ్‌స్టేలను ప్రముఖ సంస్థలైన ఎయిర్‌బిఎన్‌బి, యాత్రధామ్, హోమ్‌స్టేస్ ఆఫ్ ఇండియా, మేక్ మై ట్రిప్ తదితర భాగస్వాముల సహకారంతో అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ‘హోమ్ స్టే పాలసీ’ రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.