ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలి
- జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
- గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంలో సూచనలు అనంతపురము బ్యూరో:ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో సాధారణ ఎన్నికలు – 2024పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల వ్యయ పరిమితి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ర్యాలీ, బహిరంగ సభలకు అనుమతులు మొదలైన వాటి గురించి జాయింట్ కలెక్టర్ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తన నియమావళిపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల్లో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న అంశాలపై పూర్తి స్పష్టత ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని తెలిపారు. ఎన్నికల కమీషన్ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తోందని, వాటిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయడం జరుగుతుందని, సూచనలపై అవగాహన ఉండడం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఈఆర్వో శిరీష, తహసిల్దార్ శ్రీనివాసులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.