- పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి
- జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
హిందూపురం :ఎన్నికల కమీషన్ నిబంధనలను పాటించి పోలింగ్ కేంద్రాలను అందుకు అనుగుణంగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సూచించారు. మంగళవారం హిందూపురం రూరల్ మండల పరిధి లోని మణేసముద్రం, హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు, ఆయా పనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యుత్ సౌకర్యం, తలుపులు,కిటికీలు, నీటి సదుపాయం, బాత్రూంల స్థితిగతులు తదితర మౌలిక సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా నిబంధనల మేరకు సదుపాయాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి ఉదాసీనత లేకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దార్ శివ ప్రసాద్ రెడ్డి, బిఎల్ఓ లు శ్రీరామప్ప పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జయమ్మ… శోభ తదితరులు పాల్గొన్నారు.